బాలు నుంచి ఎంతో నేర్చుకున్నా! 

2 Oct, 2020 06:42 IST|Sakshi
హాజరైన సినీ ప్రముఖులు.. ధన్యవాదాలు తెలుపుతున్న చరణ్‌  

ఎస్పీ బాలసుబ్రమణ్యం నుంచి ఎంతో నేర్చుకున్నానని గాయని చిత్ర పేర్కొన్నారు. ఎస్పీబీ గత నెల 25న మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం సినీ పరిశ్రమ ఎస్పీ బాలసుబ్రమణ్యం సంతాప సభను నిర్వహించింది. నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నటులు విజయ్‌సేతుపతి, ప్రసన్న, వివేక్, జయరామ్, పార్థిబన్, దర్శకుడు శీనూస్వామి, గాయని చిత్ర, గాయకుడు మనో పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

ఆయన సాధించిన కీర్తి కెరటాలను శ్లాఘించారు. గాయని చిత్ర మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని చిత్ర పేర్కొన్నారు. ఈ సంతాప సభకు రాలేకపోయిన దర్శకుడు భారతీరాజా ఎస్పీబీతో తన అనుబంధాన్ని పంచుకుంటూ ఒక వీడియా పంపించారు. అదేవిధంగా ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఒకసారి కూడా ప్రత్యక్షంగా కలుసుకోలేకపోవడం తన దురదృష్టమని నటుడు విజయ్‌సేతుపతి వాపోయారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్, గాయని శైలజ, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వారిని సినీ ప్రముఖులు పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి సంతాప సభ నిర్వహించిన చిత్ర పరిశ్రమ ప్రముఖులకు ఎస్పీ చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.  (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు)

మరిన్ని వార్తలు