పోలీసులను ఆశ్రయించిన సింగర్‌ మధు ప్రియ

22 May, 2021 16:08 IST|Sakshi

సింగర్‌ మధు ప్రియ తాజాగా హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు పదే పదే బ్లాంక్‌ కాల్స్‌ వస్తున్నాయని శనివారం షీ టీమ్‌కు ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. అంతేగాక సోషల్‌ మీడియా ద్వారా కూడా తనని వేధిస్తున్నారని, అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారంటు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె మెయిల్‌ను షీ-టీమ్‌, సైబర్‌ క్రైం పోలీసులకు బదిలీ చేసింది. తనకు వస్తున్న బ్లాంక్‌ కాల్స్‌ వివరాలను మధు ప్రియ సైబర్‌ క్రైం పోలీసులకు అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ  509, 354(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

కాగా మధు ప్రియ ‘ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనాని’ అంటూ పాడి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు షోలలో తన పాటలతో అలరించిన మధు ప్రియ తన ప్రేమ, పెళ్లి వ్యవహరం విషయంలోనూ వార్తల్లో నిలిచింది. అయినప్పటికీ ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా సినిమాల్లో కూడా పాటలు పాడే చాన్స్‌ కొట్టేసిందామే. తను పాడిన పాటలన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ‘ఫిదా’ మూవీలో ఆమె పాడిన ‘వచ్చిండే... మెల్ల మెల్లగా వచ్చిండే’  పాట ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక గతేడాది వచ్చిన సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మూవీ ‘సరిలేరు నీకేవ్వరు’లో ఆమె పాడిన ‘హి ఈజ్‌ సో క్యూట్‌’ పాట కూడా పెద్ద హిట్‌ అయ్యింది. 

మరిన్ని వార్తలు