P Susheela: భారతరత్న అవార్డు నాకు అవసరం లేదు: పి సుశీల ఆసక్తికర వ్యాఖ్యలు

24 Oct, 2022 14:12 IST|Sakshi
దీపావళి సావనీర్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గాయని సుశీల తదితరులు

తమిళ సినిమా: గాన సరస్వతి పద్మభూషణ్‌ పి.సుశీల ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో సరిగమల వీణ మోగిస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ తదితర  భాషల్లో తన గానామృతాన్ని పంచిన గాయనీమణి పి.సుశీల. ఈమె 70వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్‌బుక్‌ రికార్డు, ఏ షియన్‌ బుక్‌లో చోటు సంపాదించారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పత్రికా సంఘం శనివారం సాయంత్రం నిర్వహించిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పి.సుశీల, ని ర్మాత కలైపులి ఎస్‌.థాను, దర్శకుడు మోహన్‌రాజా, నటుడు సతీష్‌ తదితరులు దీపావళి సావనీర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్‌

ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేది పాత్రికేయులేనన్నారు. అప్పట్లో సినిమా సమాచారం ఆల్‌ ఇండియా రేడియో కంటే ముందే పత్రికల్లో వచ్చేవన్నారు. తాను పెద్ద గాయని కావాలన్నది తన తండ్రి కోరికని, అది తాను నెరవేర్చాననే అనుకుంటున్నానన్నారు. తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే గాయనిగా భిక్ష పెట్టింది సంగీత దర్శకుడు ఎంఎస్‌ విశ్వనాథ్‌ అని పేర్కొన్నారు. జనరేషన్‌ మారుతున్న సంగీతం ఎప్పటికీ మరవలేనిదన్నారు. అయితే తమ కాలంలో పరిశుద్ధంగా ఉండేదని, ఈ జనరేషన్లో ...అంటూ నవ్వేశారు. తనకు పద్మభూషణ్‌ అవార్డు కోసం సిఫార్సు చేసింది అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి అని తెలిపారు.

చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్‌ రెమ్యునరేషన్‌!, 15 నిమిషాలకే అన్ని కోట్లా?

ఇక భారతరత్న అంటారా? అది తనకు అవసరం లేదని, గాయనిగా ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయానన్న సంతృప్తి చాలన్నారు. తాను పి.సుశీల పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా పేద సంగీత కళాకారులకు నెలనెలా పింఛన్‌ అందిస్తున్నానని చెప్పారు. అలాగే ఈ ట్రస్టు ద్వారా ఏటా ఒక ఉత్తమ సంగీత కళాకారులను ఎంపిక చేసి అవార్డు, రూ.లక్ష నగదును అందిస్తున్నట్లు చెప్పారు. అయితే తన పాటలకు రాయల్టీ రావడం లేదని, అది వస్తే మరికొందరికీ సాయం చేసే అవకాశం ఉంటుందని గాయని పి.సుశీల అన్నారు. కాగా ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న నటుడు బోండామణికి పత్రికల సంఘం కార్యవర్గం ఆర్థిక సాయం అందజేసింది. 

మరిన్ని వార్తలు