ఒక శకం ముగిసింది!

25 Sep, 2020 14:02 IST|Sakshi

సుప్రసిద్ధ  నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఇకలేరంటే నమ్మశక్యం కావడంలేదు. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార ఆగిపోయిందంటే జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ నమ్మక తప్పని కఠోర వాస్తవం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (74) కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు.

ఎంతో మంది యువకళాకారులు, గాయకులకు స్ఫూర్తినివ్వడమే గాదు, వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన బాలు లేని లోటు తీరదు గాక తీరదు. ఆయనకు ఆయనే సాటి. బంగారానికి తావి అబ్బిన చందంగా తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో వేనవేల పాటలతో అలరించారు. అలరిస్తూనే ఉన్నారు. కానీ ఇంతలోనే మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది. బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలే మనకిక శరణ్యం. వి మిస్ యూ బాలూ సార్...ఫర్ ఎవర్ అండ్ ఎవర్  సోషల్ మీడియా ఇదే సందేశాలతో మారు మోగుతోంది. పలువురు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఒక శకం ముగిసింది అంటూ ప్రఖ్యాత గాయని చిన్మయ శ్రీపాద ట్వీట్  చేశారు. సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా మిగిలిపోతారన్నారు. 


బాలు గాయకుడు మాత్రమే కాదు. డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా,సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటుకున్నారు. కమల్ హాసన్ , రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. ముఖ్యంగా కమల్ హాసన్ కథానాయకుడిగా ఇంద్రుడు, చంద్రుడు సినిమాలోనూ, అలాగే  2010లో వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు.


జన్మకే లాలీ...అంటూ తరలిపోయారు

1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు తర్వాత  తమిళ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో  ఆకట్టుకున్నారు.  2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలోఆయన హీరోగా తెరకెక్కిన మిథునం ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది. అంతేనా కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వారికి అమరిన ఆయన గొంతును మర్చిపోగలమా. ఆయా హీరోల, నటులు హావభావాలకు, గొంతుకు అనుగుణంగా  తన గాత్రాన్ని మలుచుకోవడం ఆయన శైలి. అదే ఆయనకు ఎంతో వన్నె. అల్లు  రామలింగయ్య, రాజబాబు లాంటి  ఎందరో హాస్యనటులకు ఆయన పాడిన పాటలు ఆదరణకు నోచుకున్నాయి. అలనాటి అగ్రహీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలు శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ జూనియర్, ప్రభాస్ లాంటి ఇనాటి యంగ్ హీరోల దాకా ఆయన పాడని హీరో లేరు. 40 ఏళ్ళ సినీ ప్రస్తానంలో 11 భాషలలో, 40వేల పాటలు, 40 సినిమాలకి సంగీత దర్శకత్వంతో ఉర్రూత లూగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. అందుకే  అవార్డులు, జాతీయ పురస్కారాలు వచ్చి వరించాయి. (జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’)

బాలు తల్లిదండ్రులు : శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (తండ్రి) , శకుంతలమ్మ (తల్లి)
జీవిత భాగస్వామి : సావిత్రి
సంతానం: చరణ్ , పల్లవి
సోదరీమణులు : శైలజ, వసంత (కుమారుడు చరణ్,  శైలజ, వసంత సినీ నేపథ్య గాయకులుగా ఉన్నారు)

>
మరిన్ని వార్తలు