Singer Sunitha: 19 ఏళ్లకే పెళ్లి.. స్టూడియోలో వ్యక్తిగత విషయాలు ఎందుకు మాట్లాడతారు? బాధేసేది.. ఎంతో ఏడ్చాను..

17 Nov, 2023 11:04 IST|Sakshi

అమృతం స్వరంగా మారితే ఈమె గొంతులా ఉంటుంది. తను మాట్లాడుతుంటే కమ్మనైన పాట వినిపిస్తున్నట్లు ఉంటుంది. ఎన్నో పాటలు ఆమె గొంతు నుంచి జాలువారి సంగీతప్రియులను సమ్మోహనపరచాయి. ఇంతకీ ఆవిడ మరెవరో కాదు సింగర్‌ సునీత. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఈ గాయని వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా రెండో పెళ్లి చేసుకున్నందుకు ఆమెను ఎంతగానో విమర్శించారు. అన్నింటినీ తట్టుకుని నిలబడింది.

17 ఏళ్లకే కెరీర్‌ మొదలుపెట్టా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీత ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'జీవితంలో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కానీ వాటిని ఎలా ఎదురించి నిలబడ్డామనేది ముఖ్యం. నా జీవితంలో జరిగిన చాలా విషయాలు మర్చిపోయాను. కొన్నిసార్లు నా చుట్టాలే ఆ రోజు అలా జరిగితే నువ్వు ఎంత ఏడ్చావో.. తెలుసా, చాలా బాధేసింది అని చెప్తుంటారు. అంతలా అన్నింటినీ మర్చిపోయాను. చాలా విషయాల్లో నేను మోసపోయాను. నా మీద వచ్చిన విమర్శలకైతే లెక్కే లేదు. 17 ఏళ్ల వయసులో కెరీర్‌ మొదలుపెట్టాను. రకరకాల కారణాల వల్ల 19 ఏళ్లకే పెళ్లయింది. చిన్న వయసులోనే సంపాదిస్తూ.. కుటుంబానికి నేనే పెద్ద దిక్కు అన్నట్లుగా పెద్ద పెద్ద బాధ్యతలను భుజాన వేసుకున్నాను.

నా చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారు
21 ఏళ్ల వయసులో ఆకాశ్‌ పుట్టినప్పుడు తల్లిగా ఆనందపడ్డాను. 24 ఏళ్ల వయసులో శ్రేయ పుట్టింది. ఓపక్క పిల్లలను చూసుకుంటూనే మరోపక్క సింగర్‌గా పని చేశాను. నాన్న వ్యాపారంలో నష్టం రావడంతో ఉన్న ఇల్లు కూడా పోయింది. అలాంటి పరిస్థితుల్లో కెరీర్‌ మొదలుపెట్టినదాన్ని.. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. నాకు 35 ఏళ్లు వచ్చేవరకు కష్టపడుతూనే ఉన్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లే చాలాసార్లు నన్ను మోసం చేశారు. మోసపోయిన ప్రతిసారి నేను షాకయ్యేదాన్ని. నా నవ్వు ఫేక్‌గా ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. నా గురించి ఏదైనా చెప్పడం ఇష్టం లేనప్పుడు నవ్వి వదిలేస్తాను. అది ఫేక్‌ అనుకున్నవాళ్లున్నారు. ఆ నవ్వులో బాధను చూసినవాళ్లూ ఉన్నారు.

వ్యక్తిగత విషయాలు స్టూడియోలో ఎందుకు?
పలు కారణాల వల్ల కెరీర్‌లో కొన్ని మంచిమంచి అవకాశాలు వదిలేసుకున్నాను కూడా! 28 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 5 వేల షోలు చేసి ఉంటాను. నా గొంతు హస్కీగా ఉంది. మాటలు కొన్ని గొంతులోనే ఆపేస్తుందని నానామాటలన్నారు. నా జీవితంలో ఏం జరుగుతుందో మీకేం తెలుసు? వ్యక్తిగత విషయాల గురించి స్టూడియోలో మాట్లాడొద్దు. గుడిలోకి వెళ్లేముందు బయట ఎలాగైతే చెప్పులు వదిలేసి లోనికి వెళ్తావో అలాగే స్టూడియో బయట నీ పర్సనల్‌ లైఫ్‌ను వదిలేసి ప్రొఫెషనల్‌ లైఫ్‌లోకి అడుగుపెట్టాలి. నేను అదే చేశాను. కానీ ఆ కామెంట్స్‌ విన్నప్పుడు బాధపడేదాన్ని. నేను సెన్సిటివ్‌.. ప్రతిదానికీ ఏడుస్తాను. నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకోవడమే!' అని చెప్తూ ఏడ్చేసింది సునీత.

చదవండి: ‘మంగళవారం’ మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు