వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది : పీ సుశీల

26 Sep, 2020 11:30 IST|Sakshi

కరోనా ఇంత అలజడి రేపుతుందనుకోలేదు

సాక్షి, చెన్నై: ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం మరణంపై గాయని పీ సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచానికి ఎంతో మేలు చేసిన బాలుని మహమ్మారి వెంటాడి వెంటాడి వేధించి తీసుకుపోయిందని భావోద్వేగానికి గురయ్యారు. కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదంటూ సంతాపం ప్రకటించారు. మనందరి ఆప్తుడిని తీసుకుపోయి పెద్ద అగాధంలోకి తోసేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులందర్నీ తీరని దుఃఖ సముద్రంలోముంచేసిందంటూ సుశీల కంట తడిపెట్టారు. ఎస్పీ బాలు మరణం వ్యక్తిగతంగా తనకు చాలా దెబ్బ అని అన్నారు. గుండె ధైర్యం తెచ్చుకుని, విషాదం నుంచి కోలుకోవాలని, అభిమానులకు సూచించారు. ఈ మేరకు సుశీలమ్మ ఒక వీడియోను విడుదల చేశారు. (ఒక శకం ముగిసింది!)

మరోవైపు నేడు (శనివారం) మధ్యాహ్నం చెన్నై శివారు ప్రాంతంలోని ఆయన ఫామ్‌హౌజ్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ప్రజలెవరూ రావొద్దని తిరువళ్లూరు ఎస్పీ అరవింద్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలు కుటుంబ సభ్యులు, ప్రముఖులు మినహా ఆయన మృతదేహాన్ని చూసేందుకు ఎవరికీ అనుమతి లేదన్నారు. అభిమానులు, నటులు భారీ సంఖ్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫాంహౌజ్‌కు  రెండు కిలోమీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పరిసరాల్లో వాహనాలను కూడా అనుమతించేది లేదని ఎస్పీ అరవింద్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పట్నుంచి ఎక్మోతో పాటు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. కానీ సెప్టెంబరు 24న ఆయన ఆరోగ్యం మరోసారి  క్షీణించింది. చివరకు శుక్రవారం ఉదయం తుది శ్వాస తీసుకున్న సంగతి తెలిసిందే. (బాలు స్వగ్రామంలో విషాదఛాయలు)

మరిన్ని వార్తలు