తొలిపాటకే నేషనల్​ అవార్డు.. ఈ సింగర్​ గుర్తున్నాడా?

9 Jul, 2021 16:22 IST|Sakshi

సంగీత సాధన.. ఆపై వినసొంపైన గాత్రంతో అలరించే గాయకులు కొద్దిమందే ఉన్నారు. కానీ, తమది కాని భాషల్లో అలరించిన.. అలరిస్తున్న గాయకులు కొందరు ఉన్నారు. వాళ్లలో చెప్పుకొదగ్గ సింగర్‌ ఉన్నికృష్ణన్‌. తొలి పాటకే జాతీయ అవార్డు అందుకున్న ఘనత ఈయన ఖాతాలో ఉంది.   90, 2000 దశకంలో ఆయన పాడిన పాటలన్నీ దాదాపు ఛార్‌బస్టర్‌లే. ఆయన గొంతు నుంచి వెలువడిన ప్రేమ, రొమాంటిక్​, విషాద గీతాలు.. ఈనాటికీ అలరిస్తూనే ఉన్నాయి. అన్నట్లు ఇవాళ ( జులై 9) ఉన్నికృష్ణన్‌ 55వ పుట్టినరోజు. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: 1966 జులై 9న కేరళలో పలక్కడ్‌లో  జన్మించాడు పరక్కల్‌ ఉన్నికృష్ణన్‌. కానీ, వీళ్ల ఫ్యామిలీ నేపథ్యం మాత్రం తమిళనాడులోనిది. మద్రాస్‌లో ప్రముఖ ఆయుర్వేద చికిత్సాలయం కేసరి కుటీరంను నిర్వహించింది ఉన్ని ముత్తాత కేసరి. ఈయన తెలుగు మహిళా మ్యాగజైన్‌ గృహలక్ష్మీ ప్రమోటర్‌ కూడా. పన్నెండేళ్ల వయసులో కర్ణాటక సంగీతం నేర్చుకున్న ఉన్నికృష్ణన్​.. చదువులో పడి ఆ తర్వాత పక్కనపెట్టేశాడు. కానీ, కెరీర్​ ఎదుగుతున్న టైంలో అనూహ్య నిర్ణయంతో ఆయన మళ్లీ పాటల వైపు అడుగులేశాడు.

తొలి​పాటకే నేషనల్‌ అవార్డు..
ఉన్నికృష్ణన్‌ తొలిసారి పాడిన పాట ‘కాదలన్‌’1994(తెలుగులో ప్రేమికుడు) చిత్రంలోని ‘ఎన్నవలే అది ఎన్నవలే’(ఓ చెలియా నా ప్రియ సఖియా). ఈ పాటతోపాటు అదే ఏడాది రిలీజ్‌ అయిన ‘పవిత్ర’ లోని ‘ఉయిరుమ్‌ నీయే..’ పాటకు(ఇదీ రెహమాన్‌ బాణీ కట్టిందే) గానూ సంయుక్తంగా నేషనల్‌ బెస్ట్‌ సింగర్‌గా అవార్డు దక్కింది ఉన్నికృష్ణన్‌కి.  ఇక అప్పటి నుంచి తన మధురమైన గాత్రంతో ఎన్నో మరిచిపోలేని పాటలను పాడారు ఆయన. విశేషం ఏంటంటే.. ఉన్నికృష్ణన్‌ కూతురు ఉత్తర, పదేళ్ల వయసులో తన తొలిసాంగ్‌(2014లో వచ్చిన మళయాళం మూవీ శైవంలోని అళగు.. సాంగ్‌) ద్వారా నేషనల్‌ అవార్డు దక్కించుకుంది. అలా తండ్రీకూతుళ్లిద్దరూ డెబ్యూ సాంగ్‌తోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం.

నాలుగు భాషల్లో..   
తమిళ, తెలుగు, మళయాళం, కన్నడం.. ఇలా నాలుగు భాషల్లో కలిపి నాలుగు వేల పాటలు పాడారాయన. హిందీలో ఒకేఒక్క పాట.. అది కూడా అపరిచిత్‌(అపరిచితుడు హిందీ డబ్‌)లో ‘కుమారి’ పాటను పాడారు. ఇక తెలుగులో ‘ప్రేమికుడు’తో మొదలైన ఆయన పాట.. ఇద్దరులో ‘శశివదనే’, రక్షకుడులో ‘సోనియా సోనియా’, జీన్స్‌, ప్రేమికుల రోజు, ప్రేమకు వేళాయెరా, కలిసుందాం రా, మా అన్నయ్య, రిథమ్‌, గోదావరి, అనుమానాస్పదం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రంగం.. ఇలా స్ట్రయిట్‌, డబ్బింగ్‌ సినిమాలెన్నింటితోనో ఆయన గాన ప్రయాణం కొనసాగింది.

ఆయన వాయిస్​లోని డెప్త్​.. ఆ పాట పాడింది ఆయనే అని గుర్తు పట్టేలా చేస్తుంది వినేవాళ్లను.  ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల ద్వారా ఎక్కువగా ఆయన పాటలు పాపులర్‌ అయ్యాయి. ముఖ్యంగా ‘ఉగాది’ మూవీలో దాదాపు అన్నిపాటలు ఉన్నినే పాడారు. క్యాసెట్ల రికార్డింగ్​ల టైంలో ఈయన పాటలు ఎక్కువగా సేల్​ అయ్యేవి. 


 
సినిమాలు తగ్గి.. 
సినిమాల్లో యువ గాయకుల హవాతో ఈ మధుగాయకుడికి అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. 2012 టైంలో దేవుడి పాటలతో బిజీగా గడిపారు ఆయన. పలు టీవీ సీరియల్స్​కు సైతం ఆయన గానం అందించారు. ఆ తర్వాత సింగింగ్‌ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ హుందా పొజిషన్​లో కనిపించారు. వెస్ట్రన్​ మ్యూజిక్​ డామినేషన్​ కొనసాగుతున్న రోజుల్లో క్లాసిక్​ మ్యూజిక్​ను నిలబెట్టాలనే ఆయన తాపత్రయం పలు షోల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది కూడా. 

క్లాసికల్​ ఫ్యామిలీ
ఉన్ని చదువు మొత్తం చెన్నైలోనే పూర్తైంది. ఆ తర్వాత 1987 నుంచి ఏడేళ్లపాటు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసి.. ప్రొఫెషనల్‌ సింగర్‌ అవ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేశాడు. చిన్నతనంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్న ఉన్ని.. సంగీత కళానిధి డాక్టర్‌ విశ్వనాథన్‌ స్ఫూర్తితో గాయకుడిగా రాణించాలని నిర్ణయించుకున్నాడు. పలువురి శిష్యరికంలో మంచి గాయకుడిగా రాటుదేలాడు. స్టేజ్‌ షోలు ఇస్తున్న తరుణంలో.. ఈయన గాత్రం నచ్చడంతో కాదలన్​ సినిమాకు అవకాశం ఇచ్చాడు సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌. ఉన్నికృష్ణన్​ భార్య ప్రియ భరతనాట్యం కళాకారిణి. కూతురు ఉత్తర సింగర్​గా రాణిస్తోంది. కొడుకు వాసుదేవ్​ క్రికెట్​లో రాణించడమే కాకుండా.. గాత్రంతోనూ అలరిస్తున్నాడు. మొత్తంగా కళతోనే ప్రయాణిస్తోంది ఉన్నికృష్ణన్​ కుటుంబం.

మరిన్ని వార్తలు