Vani Jairam Biography And Career: అలా పాడాలంటే ఆమె తర్వాతే ఎవరైనా..!

4 Feb, 2023 15:51 IST|Sakshi

వాణీ జయరాం గళం పాడితే ఏ పాటైనా అపురూపమైన ఆణిముత్యంలా జాలు వారాల్సిందే. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని అలరించింది ఆమె. ఆమె కృషికి ఫలితంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించి గౌరవించింది. అయితే ఆమె హఠాన్మరణంతో అవార్డు స్వీకరించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇవాళ చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా  సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన వాణీ జయరాం గురించి తెలుసుకుందాం. 

తమిళనాడులోని వేలూరులో జననం

1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో వాణీ జయరాం జన్మించారు. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. ‘మీ పాప భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టమని చెప్పారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదు. ఆమె దాదాపు 19 భాషల్లో పాటలు పాడింది.  1971లో జయా బచ్చన్ చిత్రం గుడ్డితో అరంగేట్రం చేసిన బోలే రే పాపిహరా పాటతో జైరామ్ సంగీతంలోకి ప్రవేశించారు. మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారాలు కూడా అందుకుంది. కళా రంగానికి చేసిన సేవలకు గాను జనవరి 25న పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది.

పదేళ్లకే ఆల్ ఇండియా రేడియోలో అవకాశం

 ఐదేళ్ల వయసులో కడలూరు శ్రీనివాస అయ్యంగార్‌ అనే విద్వాంసుని దగ్గర తొలిసారి సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత టి.ఆర్‌.బాలసుబ్రమణియన్‌, త్రివేండ్రం ఆర్‌.ఎస్‌.మణి లాంటి సంగీత విద్వాంసుల శిక్షణతో మరింత రాటు దేలింది.  పదేళ్ల వయసులో తొలిసారి ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకున్నారు వాణీ జయరా.. అక్కడి నుంచే మొదటిసారి తన అమృత స్వరాన్ని  బయటి ప్రపంచానికి రుచి చూపించారు. దాదాపు పదేళ్ల పాటు రేడియోలో వరుసగా నాటకాలు వేస్తుండటం.. కవితలు చదవడం.. పాడటం వ్యాపకంగా మారిపోయింది. 

రేడియో పాటలు పాడిన వాణీ చిన్న వయసులోనే స్కూల్లో ఓ సెలబ్రిటీగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె మనసు సినిమా పాటల వైపు అడుగులు వేసింది. అయితే శాస్త్రీయ సంగీతాన్ని తప్ప సినీ గీతాలు ఆలపించడాన్ని వాణీ కుటుంబసభ్యులు అవమానంగా భావించేవారు.  అందుకే రేడియోలో వచ్చే సినిమా పాటల్ని ఎవరికీ వినిపించకుండా తక్కువ సౌండ్‌ పెట్టుకొని కంఠస్థం చేసేవారట. పెళ్లి తర్వాత భర్త జయరాం ప్రోత్సాహంతో కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె.. 1969లో బాంబేలో తొలి కచేరి ఇచ్చారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

కొత్తగా పాడాలంటే ఆమె తర్వాతే ఎవరైనా

ఆమె పాట పాడటం నచ్చి ఎన్నో సంస్థలు కచేరీలకు ఆహ్వానించేవారు. అలా ఓ సందర్భంలోనే సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్‌ కంటపడ్డారు వాణీజయరాం. ఆయనకు ఆమె గొంతు బాగా నచ్చడంతో ఆమెను గుల్జార్‌కు పరిచయం చేశారు. అనంతరం 1971లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశం కల్పించారు. అందులో ఆమె పాడిన ‘బోలే రే’ పాట అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ పాటకు నాలుగు అవార్డులు వచ్చాయి. అలా మొదలైన ఆమె సినీ ప్రస్థానం ఓ ప్రవాహంలా కొనసాగింది. వాణీ జయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు పది వేలకు పైగా పాటలు ఆలపించారు.

తెలుగు పరిచయం చేసింది ఆయనే..
వాణీ జయరాం గొంతును తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది మాత్రం ఎస్‌.పి.కోదండపాణి. ‘అభిమానవంతుడు’ అనే చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీజయరాంతో పాడించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోఫుల్ బిజీ అయిపోయారు వాణీ. కె.బాలచందర్‌ తీసిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ సినిమా పాటలకు తొలిసారి జాతీయ అవార్డు దక్కింది. తెలుగులో ‘శంకరాభరణం’ సినిమాలోని పాటలకు, ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా’.. పాటకు  మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలంటే వాణీతోనే పాడించాలనుకునేవారట సంగీత దర్శకులు. 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు