Singer Vani Jairam: అధికారిక లాంఛనాలతో ముగిసిన వాణీ జయరాం అంత్యక్రియలు

5 Feb, 2023 20:10 IST|Sakshi

అధికారిక లాంఛనాలతో ప్రముఖ గాయని వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. తమిళనాడు ప్రభుత్వం  అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.  చెన్నైలోని బేసంట్​నగర్​ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్ ఆమె పార్థివదేహానికి  నివాళులర్పించారు.  వాణీజయరాం మృతిపై సీఎం సంతాపం తెలిపారు.

సీఎం మాట్లాడుతూ.. ' ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందా. వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డ్ కూడా ప్రకటించింది. ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె​ మరణించడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని అన్నారు. 

కాగా.. శనివారం చెన్నైలోని ఆమె నివాసంలో మరణించారు.  దేశవ్యాప్తంగా దాదాపు 19 భాషల్లో 10 వేలకు పైగా పాటలు ఆలపించారు. అయితే ఆమె మృతిపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆమె ముఖంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాణీ భర్త జయరామ్ ఐదేళ్ళ క్రితం (2018లో) మరణించారు. ఈ దంపతులకు పిల్లలు ఎవరూ లేరు. సంగీతమే తమకు పిల్లలు లేని లోటు తీర్చిందని ఆమె చెబుతూ ఉండేవారు. బంధువులే వారసులై ఈ రోజు వాణీ జయరామ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు