Sirivennela Sitarama Sastry: 16 ఏళ్ల వయసులో పెళ్లి.. తను నా బెటర్‌ త్రీ ఫోర్త్‌!

1 Dec, 2021 09:13 IST|Sakshi

Sirivennela Sitarama Sastry Heart Touching Words About Wife Old Interview: మామూలుగా జీవిత భాగస్వామిని ‘బెటరాఫ్‌’ అంటుంటాం. సిరివెన్నెల తన సతీమణికి అంతకన్నా ఎక్కువే ఇచ్చారు. ‘పద్మ నాకు బెటర్‌ హాఫ్‌ కాదు, బెటర్‌ త్రీ ఫోర్త్‌’ అని ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిరివెన్నెల అన్నారు.  ‘‘ఆమె నా పాట... నా భార్య, నా పాట ఎప్పుడూ బోర్‌ కొట్టవు. ‘నువ్వు సీతారామశాస్త్రి మాత్రమే.. నీ జీవితానికి నిజమైన సిరివెన్నెల పద్మ’’ అని ప్రముఖ గాయని జానకిగారు నాకు చెప్పిన మాట అక్షరాలా నిజం.

నన్ను, నాకుటుంబాన్ని పద్మ చూసుకుంటూ, అందరి బాధ్యతలు నిర్వర్తిస్తూ చాలా ఆనందాలను కోల్పోయింది. నా జగమంత కుటుంబాన్ని తానే మోసి నన్నెప్పుడూ ఏకాంతంగా ఉంచి, ప్రొఫెషన్‌కి అంకితం అయ్యేలా చేసింది. అలాంటి పద్మ నాకు బెటర్‌ హాఫ్‌ కాదు... బెటర్‌ త్రీ ఫోర్త్‌’’ అని ఆ ఇంటర్వ్యూలో సిరివెన్నెల అన్నారు. 

ఆమే ఆయన పాటకు తొలి శ్రోత
పదహారేళ్ల వయసులో ‘సిరివెన్నెల’ చిటికెన వేలు పట్టుకుని ఏడడుగులు వేశారు పద్మావతి. సిరివెన్నెలతో తన జీవితం గురించి ఆ ఇంటర్వ్యూలో పద్మావతి మాట్లాడుతూ – ‘‘మాదీ, సీతారామశాస్త్రిగారిదీ అనకాపల్లే. నాకు సినిమాలన్నా, పాటలన్నా చాలా ఇష్టం. లంచ్‌ బ్రేక్‌లో ఇంటికి వచ్చినప్పుడు రేడియోలో వచ్చే పాటలు విన్నాకే స్కూలుకెళ్లేదాన్ని. పాటలంటే అంత ఇష్టం ఉన్న నేను సినిమా పాటలు రాసే వ్యక్తితో జీవితం పంచుకుంటానని అనుకోలేదు.

పెళ్లి చూపుల్లో సీతారామశాస్త్రిగారు నన్ను చూశారు కానీ నేను బిడియంతో తలెత్తి చూడలేదు. పెళ్లి పీటల మీదే ఆయన్ను చూశాను. మా మామగారు లేకపోవడంతో ఇంటి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలూ శాస్త్రిగారివే. పెళ్లి తర్వాత ఆయన భాగస్వామిగా అన్ని బాధ్యతలు నాకూ వచ్చాయి. ఇంటి బాధ్యతల్లో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదు. మా అత్తగారి (సుబ్బలక్ష్మి) సలహాలు తీసుకుని అన్నీ నేనే చూసుకున్నాను. మావారు ఎప్పుడూ ఏదో ఒకటి చదువుకుంటూ, రాసుకుంటూ ఉండేవారు.

‘సిరివెన్నెల’ సినిమాకు సీతారామశాస్త్రిగారిని గేయ రచయితగా కె. విశ్వనాథ్‌గారు నిర్ణయించినప్పుడు మేం పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘సిరివెన్నెల’ చిత్రం విడుదల వరకూ అనకాపల్లిలో ఉండేవాళ్లం. ఆ సినిమా హిట్‌ తర్వాత శాస్త్రిగారికి ఎక్కువ అవకాశాలు రావడంతో మద్రాసుకు (చెన్నై) షిఫ్ట్‌ అయ్యాం. మా అత్తగారి సహకారంతో ఇల్లు, పిల్లల చదువులన్నీ నేనే చూసుకున్నాను. పదేళ్ల తర్వాత హైదరాబాద్‌కి వచ్చాం. ఆయన రాసిన ప్రతి పాటను ముందు వినేది నేనే. ఆయన రాసిన ప్రతి చిన్న కాగితం జాగ్రత్తగా దాస్తాను. ఆయన రాసిన పాటలతో మా ఇంట్లో నేను ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాను’’ అన్నారు. 

చదవండి: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకు ఆ జిల్లా అంటే అమితమైన ప్రేమ..

మరిన్ని వార్తలు