ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత

1 Dec, 2021 16:31 IST|Sakshi

తీవ్రమైన న్యుమోనియాతో గత నెల 24న కిమ్స్‌లో చేరిక 

చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’సీతారామశాస్త్రి (66) కన్నుమూశారు. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ నవంబర్‌ 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఆరేళ్ల క్రితం కేన్సర్‌ను గుర్తించారు. అప్పట్లోనే రెండు ఊపిరితిత్తుల్లో ఒకదాన్ని తొలగించారు. తర్వాత బైపాస్‌ సర్జరీ చేశారు.

ఇటీవల రెండో ఊపిరితిత్తికీ కేన్సర్‌ సోకడంతో 50శాతం తొలగించాల్సి వచ్చింది. ఆక్సినేషన్‌ సరిగా లేకపోవడంతో ఆయన్ను గత 5 రోజుల నుంచి కిమ్స్‌లో ఎక్మోపై ఉంచా రు. అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ కావడంతో పాటు ఇదే సమయంలో కిడ్నీ పనితీరు కూడా దెబ్బతింది. కేన్సర్‌ కారణంగా రెండు ఊపిరితిత్తులు పాడైపోవడం, బైపాస్‌ సర్జరీ కావడంతో కోలుకోలేకపోయారు. ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.  

పద్మశ్రీ.. 11 నంది అవార్డులు 
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న డా. చేంబోలు వెంకట యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. పదో తరగతి వరకు అనకాపల్లిలో చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్‌ పూర్తి చేసి ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ (బీడీఎస్‌)లో చేరారు. తండ్రి చనిపోవడంతో మెడిసిన్‌ను మధ్యలోనే ఆపేశారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జననీ జన్మభూమి’సినిమాతో కెరీర్‌ ప్రారంభించారు.

కె. విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’చిత్రానికి సీతారామశాస్త్రి అన్ని పాటలూ రాశారు. ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయింది. సీతారామశాస్త్రి ఇప్పటివరకు సుమారు 800 సినిమాలకు దాదాపు 3,000 పాటలు రాశారు. పద్మశ్రీతో పాటు 11 నంది అవార్డులు అందుకున్నారు. ‘సిరివెన్నెల’కు భార్య పద్మావతి, కుమారులు సాయి వెంకట యోగేశ్వర శర్మ, రాజా భవానీ శంకర శర్మ, కుమార్తె లలితాదేవి ఉన్నారు. సిరివెన్నెల మరణవార్త విని సినీతారలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఉంచనున్నారు. తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, సిరివెన్నెల మృతి పట్ల గవర్నర్‌ సౌందరరాజన్‌ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు