Sirivennela Award Winning Songs: సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే..

1 Dec, 2021 11:54 IST|Sakshi

Top 11 Sirivennela Sitaramasastry Nandi Award Winning Songs List: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. అందులోని భావానికి వావ్‌ అనాల్సిందే. ఆయన రచన, సాహిత్యం అలాంటిది. అంతే కాదు అక్షరానికి ఎంత శక్తి ఉంటుందని తెలియజేసేవారిలో అతి ముఖ్యులు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. ‘సరస స్వర సుర ఝరీ గమనమౌ’ అంటూ మొదలైన ప్రయాణంలో ఎన్నో అవార్డులు. ఒకటి కాదు, రెండు కాదు, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన సాహిత్యానికి కానుకగా వరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆయన సాహిత్యం అందించిన పాటలు, నంది అవార్డులు గెలుచుకున్న విశేషాలు ఇవే. 

1. చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట ‘విధాత తలపున’. ‘సిరివెన్నెల’ చిత్రంలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. కే. విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కె.వి. మహదేవన్‌ స్వరాలు అందించారు.

2. రెండోసారి కూడా కే. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'శ్రుతిలయలు' సినిమాలోని 'తెలవారదేమో స్వామి' పాటకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఈ పాటకు కూడా కె.వి. మహదేవన్‌ స్వరాలు సమకూర్చారు.

3. మూడోసారి హైట్రిక్‌గా కే. విశ్వనాథ్‌ డైరెక్ట్‌ చేసిన సినిమాలోని పాటకే నంది అవార్డు సీతారామ శాస్త్రిని వరించింది. ఇళయరాజా స్వరాలు అందించిన ‘స్వర్ణకమలం’లో ‘అందెల రవమిది పదములదా!’ అంటూ సాగే పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

4. రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు కీలక పాత్రలో నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘గాయం’. ఇందులో ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’ అంటూ సాగే పాటను సిరివెన్నెల రాశారు. శ్రీ కొమ్మినేని స్వరాలు సమకూర్చిన ఈ పాటకు నంది అవార్డు దక్కింది.

5. ఐదో నంది అవార్డు 'శుభలగ్నం' సినిమాలోని ‘చిలుక ఏ తోడు లేక’ అనే పాట రచిచించనందుకు దక్కింది.

6. శ్రీకారం చిత్రంలోని ‘మనసు కాస్త కలత పడితే' అంటూ సాగే గేయానికి ఆరో నంది అవార్డు లభించింది. 

7. ఏడో నంది అవార్డు ‘సింధూరం’ చిత్రంలోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’ పాటకు వరించింది.

8. సుమంత్‌ హీరోగా అరంగ్రేటం చేసిన ‘ప్రేమకథ’ సినిమాలోని 'దేవుడు కరుణిస్తాడని' అనే పాటకు ఎనిమిదో నంది అవార్డు వచ్చింది.  

9. తొమ్మిదో నంది అవార్డు ‘చక్రం’లోని 'జగమంత కుటుంబం నాది' అనే పాటకు దక్కింది. 

10. పదో నంది అవార్డు ‘గమ్యం’ (ఎంత వరకూ ఎందుకొరకు)

11. పదకొండో నంది అవార్డు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (మరీ అంతగా)

వీటితో పాటు సిరివెన్నెలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం, మహాత్మ, కంచె చిత్రాలకు పాటలు రాసినందుకుగాను సౌత్‌ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వరించాయి. గోవాలోని పనాజీలో 2017లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతులమీదుగా 'సంస్కృతి' కేటగిరీ కింద 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్' అవార్డును అందుకున్నారు సిరివెన్నెల.

ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు

మరిన్ని వార్తలు