Pavala Syamala: శ్యామలకు 'సిసింద్రీ' డైరెక్టర్‌ రూ. 50 వేల సాయం

18 May, 2021 17:53 IST|Sakshi

హాస్యనటిగా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ప్రేక్ష​కులను దగ్గరైన నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతున్నారు. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలతో పావలా శ్యామల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో పావలా శ్యామల పరిస్థితిని తెలుసుకొని ఆమెకు సహాయం చేయడానికి సిసింద్రీ డైరెక్టర్‌ శివ నాగేశ్వర రావ్‌ ముందుకు వచ్చారు. తన వంతు సహాయంగా ఆమెకు 50వేల రూపాయలను అందించారు. ఆయన తరుపు వాళ్లు వచ్చి పావలా శ్యామలకు ఆ డబ్బును అందించారు. 

 అనారోగ్యం సమస్యలతో సినిమాలకు దూరమైన ఆమె హైదరాబాద్‌లోని ఓ చిన్న ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఇటీవలె పావలా శ్యామల ఇబ్బందులు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆమెను కలిసి తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అలాగే మా అసోసియేషన్‌ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమెకు సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు.

ఇక ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్‌ హోటల్‌, గోలీమార్‌ వంటి సూపర్‌ చిత్రాల్లో నటించి పావలా శ్యామల గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి రూ.2 లక్షలు పంపించారని, తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారని  అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల.

చదవండి : పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో..

మరిన్ని వార్తలు