Sita Ramam: ఇంతందం దారి మళ్లిందా.. మెలోడీ అదిరింది

5 Jul, 2022 08:19 IST|Sakshi

‘‘ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నాదా’ అంటూ పాడేస్తున్నారు దుల్కర్‌ సల్మాన్‌. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్‌ హీరోగా, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘సీతారామం’. రష్మికా మందన్న కీలక పాత్ర చేశారు. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమాపై అశ్వినీదత్‌   నిర్మించిన ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ఇంతందం దారి మళ్లిందా..’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను సోమవారం విడుదల చేశారు.


కృష్ణకాంత్, మృణాల్, హను, విశాల్‌ 

హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘1965 యుద్ధం నేపథ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిన చిత్రమిది.     ‘ఇంతందం దారి మళ్లిందా..’ పాటని కృష్ణకాంత్‌ అద్భుతంగా రాశారు. ఆ పాట వినగానే నాకు వేటూరిగారు గుర్తుకొచ్చారు. ఎస్పీ చరణ్‌ చక్కగా పాడారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రతి పాట మనసుని హత్తుకునేలా ఉంటుంది’’ అన్నారు విశాల్‌ చంద్రశేఖర్‌.

‘‘ఇంతందం దారి..’ పాట విన్న ప్రతిసారీ మనసు హాయిగా ఉంటుంది’’ అన్నారు మృణాల్‌ ఠాకూర్‌. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఆగస్ట్‌ 5న రిలీజ్‌ కానుంది. ‘‘1965లో ఉండేలా స్వచ్ఛమైన తెలుగు పాట రాయమని హను ‘ఇంతందం దారి..’ పాట సందర్భం చెప్పి నప్పుడు ఆనందంగా అనిపించింది. ఈ పాట అత్యద్భుతంగా ఉంటుంది’’ అన్నారు కృష్ణకాంత్‌. 

మరిన్ని వార్తలు