గూగుల్‌ డూడుల్‌లో ఈయన్ని గుర్తుపట్టారా? ‘మార్లోన్‌ బ్రాండో ఆఫ్‌ సౌత్‌ఇండియన్‌ సినిమా’గా పేరు ఉంది ఈయనకు..

1 Oct, 2021 08:14 IST|Sakshi

Sivaji Ganesan Birth Anniversary Google Doodle: భారీ బడ్జెట్‌లు, హై టెక్నికల్‌ వాల్యూస్‌, క్వాలిటీ మేకింగ్‌, స్టార్‌ కాస్టింగ్‌, పాన్‌ ఇండియన్‌ సినిమాలు.. ఇవన్నీ ఇండియన్‌ సినిమాను గ్లోబల్‌ లెవల్‌లో నిలబెతున్నాయి. వెండితెరపై తమ కటౌట్‌లతో విదేశీ అభిమానం సైతం సంపాదించుకుంటున్నారు మన నటులు ఇప్పుడు. అయితే కొన్ని దశాబ్దాల క్రితమే కేవలం ‘నటన’ ద్వారా తన స్టార్‌డమ్‌ను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి శివాజీ గణేషన్‌. ఈరోజు ఆయన 93వ జయంతి (అక్టోబర్‌ 1, 2021). 

మెథడ్‌ యాక్టర్‌గా పేరున్న శివాజీ గణేషన్‌.. తన నటన ద్వారా కమల్‌ హాసన్‌, రజినీకాంత్‌లాంటి వాళ్లెందరిపైనో ప్రభావం చూపించిన వ్యక్తి. 

అసలు పేరు గణేస(ష)మూర్తి.. పుట్టింది తమిళనాడు విల్లుపురంలో అక్టోబర్‌ 1, 1928న. 

 ఏడేళ్ల వయసుకే థియేటర్‌ ఆర్టిస్ట్‌ అవతారం.. నాటకాల్లో ఆడ పాత్రలతో మంచి గుర్తింపు

1945లో శివాజీ కంద హిందూ రాజ్యం అనే నాటకంలో శివాజీ పాత్రను పోషించాడు. స్టేజీపై ఆయన నటనను చూసి మైమరిచిపోయిన ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి.. గణేసన్‌ను నటనలో ‘శివాజీ’గా అభివర్ణించాడు. అలా ఆయన పేరు అప్పటి నుంచి శివాజీ గణేసన్‌ అయ్యింది.

 

1952లో ప్రజాశక్తి సినిమా ద్వారా ఆయన తెరంగగ్రేటం చేశారు. అప్పటి నుంచి 300 సినిమాల్లో నటించారు. 

 భావోద్వేగాలు పండించడంలో శివాజీ గణేషన్‌ దిట్ట. ప్రత్యేకించి కంచు కంఠంతో తమిళ సినిమాలో ఓ చెరగని ముద్ర వేసుకున్నారు

విశేషం ఏంటంటే.. భారత సినీ రంగం నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి నటుడు ఈయనే!. 

 1960 ఈజిప్ట్‌ రాజధాని కైరోలో జరిగిన ఆఫ్రో-ఆసియన్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో బెస్ట్‌ యాక్టర్‌(వీరపాండియ కట్టబొమ్మన్‌కుగానూ) అవార్డును అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్‌ అబ్దెల్‌ నాసర్‌ నుంచి అందుకున్నారు. ఈ చిత్ర డైలాగులు నేటికి తమిళ నాట ప్రతిధ్వనిస్తుంటాయి.

 

అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తొలి భారతీయ నటుడు కూడా ఈయనే!. 1962లో కల్చరల్‌ ఈవెంట్‌ కోసం శివాజీ గణేషన్‌ హాజరయ్యారు. అంతేకాదు అప్పటి అమెరికా ప్రెసిడెంట్‌ జాన్‌ ఎఫ్‌ కెనెడీ, శివాజీని కల్చరల్‌ అంబాసిడర్‌గా గుర్తించారు కూడా. ఆ తర్వాత ఎన్నో దేశాల్లో భారతీయ నటుడి హోదాల్లో పర్యటించారు శివాజీ గణేషన్‌.

1961లో ‘పాశమలర్‌’ కుటుంబ సమేత చిత్రంగా ఓ ట్రెండ్‌ సృష్టించగా.. 1964లో వచ్చిన ‘నవరాత్రి’ తొమ్మిది గెటప్‌లతో సరికొత్త రికార్డు సృష్టించాడు

దైవ మగన్‌, పుదియా పరవై ..ఇలా ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

తేవర్‌ మగన్‌(క్షత్రియ పుత్రుడు)లో క్యారెక్టర్‌కి నేషనల్‌ అవార్డు(స్పెషల్‌ జ్యూరీ) దక్కింది శివాజీ గణేసన్‌కి. కానీ, ఎందుకనో ఆయన ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. 

1995లో ఫ్రాన్స్‌  గౌరవం, 1997లో దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు అందుకున్నారు శివాజీ గణేషన్‌.

 

తమిళ  సీనియర్‌ నటుడు ప్రభు ఈయన తనయుడే. ఇక మనవడు విక్రమ్‌ ప్రభు(తెలుగులో వచ్చిన గజరాజు హీరో) కోలీవుడ్‌లో యంగ్‌ హీరోగా ఉన్నాడు. 

ది లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ శివాజీ గణేషన్‌ను ‘మార్లోన్‌ బ్రాండో ఆఫ్‌ సౌత్‌ఇండియన్‌’గా అభివర్ణించింది. 

ఓ స్టార్‌ హీరో సినిమాలో పాటలు లేకపోవడం జరిగింది కూడా శివాజీ గణేసన్‌ విషయంలోనే. ఆయన నటించిన ‘అంధ నాల్‌’లో ఒక్క పాట కూడా ఉండదు. 

పరదేశీ(1953), పెంపుడు కొడుకు, మనోహర, బొమ్మల పెళ్లి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, రామదాసు, బంగారు బాబు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త(అలెగ్జాండర్‌ పాత్ర), నివురు గప్పిన నిప్పు, బెజవాడ బొబ్బులి, విశ్వనాథ నాయకుడు(నాగమ నాయక పాత్ర), అగ్ని పుత్రుడు లాంటి తెలుగు సినిమాలతోనూ అలరించారు.

 

ఆత్మబంధువు లాంటి తమిళ డబ్బింగ్‌ సినిమా, అందులోని పాటల్ని తెలుగు ప్రేక్షకులు చాలామంది ఇష్టపడుతుంటారు. 

► 1999 సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన పడయప్ప(నరసింహా) శివాజీ గణేసన్‌ తెర మీద కనిపించిన చివరి సినిమా.

శ్వాసకోశ సంబంధిత సమస్యలతో జులై 21, 2001న ఆయన కన్నుమూశారు. 

కలైమామణి, పద్మ శ్రీ, పద్మ భూషణ్‌, చెవలియర్‌(ఫ్రాన్స్‌), దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు, ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డులు అందుకున్నారు శివాజీ గణేషన్‌. 

►  శివాజీ గణేషన్‌ జయంతి సందర్భంగా గూగుల్‌ ఇవాళ డూడుల్‌తో ఆయన్ని గుర్తు చేసింది. 

 బెంగళూరుకు చెందిన నూపూర్‌ రాజేష్‌ చోక్సీ.. ఈ డూడుల్‌ను క్రియేట్‌ చేశాడు.

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

మరిన్ని వార్తలు