Prince Movie: ప్రిన్స్‌ రివ్యూ, కామెడీతో అదరగొట్టిన శివకార్తికేయన్‌

21 Oct, 2022 18:48 IST|Sakshi
Rating:  

టైటిల్‌: ప్రిన్స్‌
తారాగణం: శివకార్తికేయన్‌, మరియా, సత్యరాజ్‌, ప్రేమ్‌జీ తదితరులు
దర్శకుడు: అనుదీప్‌ కేవి
సంగీతం: తమన్‌
సినిమాటోగ్రాఫర్‌: మనోజ్‌ పరమహంస
నిర్మాతలు: సునీల్‌ నారంగ్‌, సురేశ్‌ బాబు, పుష్కర్‌ రామ్‌ మోహన్‌ రావు
విడుదల తేదీ: అక్టోబర్‌ 21, 2022

ఒక సినిమా విజయం సాధించిందంటే ఆ డైరెక్టర్‌ బాధ్యత రెట్టింపు అవుతుంది. తర్వాతి సినిమా అంతకు మించి విజయాన్ని సాధించేలా తీయాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా నెక్స్ట్‌ ఎలాంటి మూవీ తీస్తారోనని ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. అలాంటి పరిస్థితే ఎదురైంది దర్శకుడు కేవీ అనుదీప్‌కి. గతేడాది జాతిరత్నాలు మూవీతో ఊహించనంత సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న అనుదీప్‌ ఈసారి ప్రిన్స్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. మరి అనుదీప్‌ మరోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? ప్రిన్స్‌ మూవీ ఎలా ఉంది? ఓసారి చూసేద్దాం..

కథ:
ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వారసుడు ఆనంద్‌(శివకార్తికేయన్‌). ఇతడో స్కూలు టీచర్‌. హీరో తండ్రి విశ్వనాథ్‌(సత్యరాజ్‌) కులమతాలకు వ్యతిరేకి, అందరూ కలిసి ఉండాలనుకునే వ్యక్తి. ఇక హీరో తన స్కూల్‌లోనే మరో టీచర్‌(బ్రిటీష్‌ అమ్మాయి) అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)తో లవ్‌లో పడతాడు. ఇంగ్లండ్‌కు చెందిన జెస్సిక తండ్రికి ఇండియన్స్‌ అంటేనే గిట్టదు. దీంతో వారి ప్రేమకు అతడు రెడ్‌ సిగ్నల్‌ ఇస్తాడు. రానురానూ ఇద్దరి మధ్య లవ్‌స్టోరీ కాస్తా రెండు దేశాల మధ్య వార్‌లా మారుతుంది. మరి ఆనంద్‌ ప్రేమ సక్సెస్‌ అయిందా? అతడిని ఊరి నుంచి ఎందుకు గెంటేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
ప్రిన్స్‌ సినిమాలో మూడు కోణాలు ఉన్నాయి. కామెడీ, లవ్‌ స్టోరీ, మానవత్వం అనే అంశాలను టచ్‌ చేశాడు డైరెక్టర్‌. అనుదీప్‌ అంటేనే కామెడీ కాబట్టి ఎక్కువగా కామెడీనే నమ్ముకున్నాడు. కానీ అక్కడక్కడా కామెడీ పండించే సీన్లను సాగదీయడం కొంత చిర్రెత్తిస్తుంది. ముఖ్యంగా బాటిల్‌ గార్డ్‌ ఎపిసోడ్‌ చూసిన జనాలకు అరె ఏంట్రా ఇది అనిపిస్తుంది. లవ్‌ సీన్స్‌ కొన్నిచోట్ల అమాయకత్వం ఉట్టిపడుతూ బాగుంటాయి. అనుదీప్‌ టేకింగ్‌, శివకార్తికేయన్‌ నటన రెండూ కరెక్ట్‌గా సరిపోయాయి. కానీ విలేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు మాత్రం రొటీన్‌ ఫార్మాట్‌లోనే వెళ్లినట్లు అనిపించక మానదు.

ఫస్టాఫ్ అక్కడక్కడ బాగుంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం తన ట్రేడ్ మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు అనుదీప్. డైలాగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్‌లో హీరో దేశభక్తి కంటే హ్యుమానిటీనే గొప్పదని చెప్పే స్పీచ్‌ బాగుంటుంది. అనుదీప్‌ ఎంచుకున్న కాన్సెప్ట్‌ సీరియస్‌గా కనిపించినా దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలోనే డీల్ చేశాడు. ఏం చేసినా ఏం రాసినా అంతా నవ్వించడం కోసమే అన్నట్లు ఉంటుందీ చిత్రం. మరీ జాతిరత్నాలు రేంజ్‌లో కాకపోయినా కామెడీ ఇష్టపడేవారికి ప్రిన్స్‌ నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే?
శివ కార్తికేయన్ అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ పాత్ర సినిమాకే హైలెట్. ప్రేమ్ జీ పంచులతో ఎంటర్‌టైన్‌ చేశాడు. హీరోయిన్ మరియా లుక్‌, నటన ఫ్రెష్‌గా ఉంది. అనుదీప్‌ కామెడీ చేస్తూనే మనుషులంతా ఒక్కటేనని సింపుల్‌గా చెప్పాడు. ప్రధాన పాత్రల మాటలు ఫన్‌ క్రియేట్‌ చేస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి. తమన్‌ అందించిన సంగీతం కొంతవరకు ఆకట్టుకుంది. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్లు సాగదీయకుండా కట్‌ చేస్తే బాగుండేది. ఓవరాల్‌గా ప్రిన్స్.. నో లాజిక్.. ఓన్లీ కామెడీ మ్యాజిక్!

చదవండి: సర్దార్‌ మూవీ రివ్యూ
సౌత్‌ సినిమాలు చేయాలనుంది

Rating:  
(3/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు