Skanda Telugu Movie Reveiw: ‘స్కంద’ మూవీ రివ్యూ

28 Sep, 2023 11:42 IST|Sakshi
Rating:  

టైటిల్‌: స్కంద
నటీనటులు: రామ్‌ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్‌, పృథ్వీ రాజ్‌, ప్రిన్స్‌ సిసల్‌, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శకుడు: బోయపాటి శ్రీను
సంగీతం: తమన్‌
సినిమాటోగ్రఫీ: సంతోష్‌ డేటాకే
ఎడిటర్‌: తమ్మిరాజు
విడుదల తేది: సెప్టెంబర్‌ 28, 2023

‘స్కంద’ కథేంటంటే..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాయుడు(అజయ్‌ పుర్కర్‌) తన కూతరు పెళ్లి జరిపించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటాడు. గవర్నర్‌తో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం పెళ్లికి హాజరవుతారు. అయితే ముహుర్తానికి కొన్ని క్షణాల ముందు ఏపీ సీఎం కూతురిని తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్‌ రెడ్డి(శరత్ లోహితస్వ) కొడుకు లేపుకెళ్తాడు. దీంతో ఏపీ సీఎం.. తెలంగాణ సీఎంపై పగ పెంచుకుంటాడు. తన పరువు దక్కాలంటే తన కూతురు తిరిగి రావాలని భావిస్తాడు.

దాని కోసం ఓ కుర్రాడిని (రామ్‌ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. ఏపీ సీఎం కుమార్తెతో తెలంగాణ సీఎం కొడుకు నిశ్చితార్థం జరిగే కొద్ది క్షణాల ముందు.. రామ్‌ వచ్చి ఏపీ సీఎం కూతురితో పాటు తెలంగాణ సీఎం కూతురి(శ్రీలీల)ని కూడా తీసుకెళ్తాడు. ఎందుకలా చేశాడు? అతను ఎవరు? ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్‌)కు, ఇద్దరు సీఎంలతో ఉన్న వైర్యం ఏంటి? రామకృష్ణ రాజుకు, రామ్‌కు(ఈ సినిమాలు హీరో పాత్రకు పేరు లేదు) ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో 'స్కంద' చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి కేరాఫ్ అంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన 9 సినిమాలు మాస్‌ ఆడియన్స్‌ని మెప్పించేలా ఉంటాయి. స్కంద కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు. అయితే బోయపాటి సినిమాల్లో లాజిక్కులు ఉండవు. హీరో ఏ స్థాయి వ్యక్తినైన ఈజీగా కొట్టగలడు. కాలితో తన్నితే కార్లు సైతం బద్దలవ్వాల్సిందే. ఇదంతా గత సినిమాల్లో చూశాం.

ఇక స్కందలో అయితే రెండు అడుగులు ముందుకేశాడు. లాజిక్కు అనే పదమే వాడొద్దనేలా చేశాడు. ఎంతలా అంటే.. ఒక సీఎం ఇంటికి ఓ సామాన్యుడు ట్రాక్టర్‌ వేసుకొని వెళ్లేంతలా. ఇద్దరు ముఖ్యమంత్రులు అతని చేతిలో తన్నులు తినేంతలా. ఒక ముఖ్యమంత్రి వీధి రౌడీ కంటే నీచంగా బూతులు మాట్లాడేంతలా. పోలీసు బెటాలియన్‌ మొత్తం దిగి గన్‌ పైరింగ్‌ చేస్తుంటే మన హీరోకి ఒక్కటంటే.. ఒక్క బుల్లెట్‌ కూడా తగలదు అంటే అది బోయపాటితోనే సాధ్యమని స్కందలో చూపించాడు. ఇవన్నీ మాస్‌ ఆడియన్స్‌ని ఈలలు వేయిస్తే.. సామాన్య ప్రేక్షకులను మాత్రం సిల్లీగా కనిపిస్తాయి. 

ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్‌) జైలు సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలతో అసలు కథలోకి తీసుకెళ్తాడు. హీరో ఎంట్రీ సీన్‌ అదిరిపోతుంది. ఆ తర్వాత కథ కాస్త చప్పగా సాగుతుంది. కాలేజీ సీన్స్‌ అంతగా ఆకట్టుకోలేవు. హీరో ఎంట్రీ, అతనికిచ్చిన ఎలివేషన్స్‌ బట్టి ఏదో జరుగబోతుందనే ఆసక్తి ఆడియన్స్‌లో కలుగుతుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ గూస్‌ బంప్స్‌ తెప్పిస్తాయి. ట్విస్ట్‌ కూడా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

ఇక బోయపాటి సినిమా గత సినిమాల మాదిరి స్కంద సెకండాఫ్‌ కూడా ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రారంభమవుతుంది. రుద్రగంటి రామకృష్ణరాజు ఎందుకు జైలు పాలయ్యాడు? హీరో నేపథ్యం ఏంటి? తదితర సన్నివేశాలతో సెకండాఫ్‌ సాగుతుంది. క్లైమాక్స్‌ 15 నిమిషాల ముందు వచ్చే యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోతాయి. అదే సమయంలో విపరీతమైన హింస, అనవసరపు సంభాషణలు ఓ వర్గం ప్రేక్షకులను ఇబ్బందిని కలిగిస్తాయి. యాక్షన్‌ సీన్స్‌ పండినంతగా ఎమోషనల్‌ సన్నీవేశాలు పండలేదు. క్లైమాక్స్‌ ట్వీస్ట్‌  ఊహించని విధంగా ఉంటుంది.  ఓవరాల్‌గా మాస్‌ ఆడియన్స్‌కి అయితే బోయపాటి ఫుల్‌ మీల్స్‌ పెట్టాడనే చెప్పాలి. 

ఎవరెలా చేశారంటే.. 
మాస్‌ పాత్రలు రామ్‌కి కొత్తేమి కాదు. ఇంతకు ముందు జగడం, ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాల్లో ఆ తరహా పాత్రలు చేశాడు. అయితే స్కందలో మాత్రం ఊరమాస్‌ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. యాక్షన్స్‌ సీన్స్‌. హీరోయిన్లు శ్రీలీల, సయీ మంజ్రేకర్‌ పాత్రల పరిధి చాలా తక్కువ. అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించారు. శ్రీలీల తనదైన డ్యాన్స్‌తో మరోసారి ఆకట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అజయ్‌ పుర్కర్‌, శరత్‌ లోహితస్వ తమ పాత్రల పరిధిమేర నటించారు. వ్యాపారవేత్తగా శ్రీకాంత్‌ చక్కగా నటించాడు.దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ  తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతిక విషయాలకొస్తే.. తమన్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సంతోష్‌ డేటాకే సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్‌ బాగుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఎక్కడ రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు