‘సోదర సోదరీమణులారా’మూవీ రివ్యూ

15 Sep, 2023 09:04 IST|Sakshi

టైటిల్‌: సోదర సోదరీమణులారా
నటీనటులు: కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ 
నిర్మాత: విజయ్‌ కుమార్‌ పైండ్ల
దర్శకత్వం: రఘుపతి రెడ్డి గుండా 
నేపథ్య సంగీతం : వర్ధన్
సినిమాటోగ్రఫీ : మోహన్ చారి
ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి
విడుదల తేది: సెప్టెంబర్‌ 15, 2023

కథేంటంటే.. 
క్యాబ్ డ్రైవర్ రాజు(కమల్ కామరాజు) తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రావణి (అపర్ణాదేవి) తన కుమార్తె  కలిసి జీవిస్తూ ఉంటాడు. ఫైనాన్స్‌లో కొన్న కారు అప్పు తీర్చడం కోసం ఎక్స్ట్రా ట్రిప్పులు వేస్తుంటాడు. అలా ఒక రోజు అతని క్యాబ్‌లో సన్నీ అనే యువకుడిని వికారాబాద్‌లో ఉన్న ఒక రిసార్ట్‌కు తీసుకెళ్తాడు. తిరుగు ప్రయాణంలో ఒక అమ్మాయిని డ్రాప్ చేయమని రిసార్ట్ మేనేజర్ చెప్పడంతో ఆమెను కారులో ఎక్కించుకొని వస్తూ ఉండగా,  పోలీసులు వచ్చి కారులో ఉన్న అమ్మాయిని రేప్ చేసి చంపేశావని అరెస్ట్‌ చేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? రిసార్ట్ లో అసలు ఏం జరిగింది? పోలీసులు వస్తుంటే సన్నీ ఎందుకు పారిపోయాడు?  ఆ అమ్మాయిని రేప్ చేసి చంపిదెవరు? తన భర్తను కాపాడుకునేందుకు శ్రావణి ఏం చేసింది? చివరకు  ఈ కేసు నుంచి రాజు ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ. 

ఎలా ఉందంటే..
ఈ సినిమా కథ కొత్తది ఏమీ కాదు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు చేసిన తప్పుకు ఒక అభం శుభం తెలియని వ్యక్తిని బలి చేయబోతూ చివరికి తానే బలి కావాల్సి వచ్చిన ఒక పోలీసు అధికారి కథ. సాధారణంగా ఏదైనా ఒక క్రైమ్ గురించి మీడియాలో పోలీసుల వర్షన్‌ మాత్రమే ప్రసారమవుతుంది. అదే చూసి బయట వ్యక్తులు ఆ క్రైమ్ వెనుక ఉన్నది మీడియాలో చెప్పిన వారే అని దాదాపుగా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. కానీ పోలీసులు తమ పై అధికారులు లేదా రాజకీయ నేతల ఒత్తిడితో ఎలా కేసులను తారుమారు చేస్తారు? చివరికి తమ మీదకు వస్తుందనుకున్న టైంలో ఎలా బిహేవ్ చేస్తారు?  ఇలాంటి విషయాలను ఈ కథలో చర్చించాడు దర్శకుడు.

తప్పు చేయని వ్యక్తులను పోలీసులు ఎలా కార్నర్ చేస్తారు?  అధికారుల కోసం ఎలా అడ్డదారులతోక్కుతారు అనే విషయాలను సినిమాలో చూపించి రియాలిటీ కి దగ్గరలో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చినట్టు అనిపించింది. అయితే సినిమా చిన్న బడ్జెట్ ది కావడంతో పూర్తిస్థాయిలో దర్శకుడు ఔట్‌పుట్‌ రాబట్టలేకపోయాడేమో అనిపించింది.

ఎవరెలా చేశారంటే..
అమాయక క్యాబ్ డ్రైవర్ రాజు పాత్రలో కమల్ కామరాజు చక్కగా నటించాడు. రాజు భార్యశ్రావణిగా అపర్ణాదేవి తనదైన నటనతో ఆకట్టుకుంది. సీఐ భాస్కర్‌గా బాహుబలి ప్రభాకర్ మెప్పించాడు. హోం మినిస్టర్‌గా సీనియర్ నటుడు పృథ్వీ నెగటివ్‌ షేడ్‌‌లో ఆకట్టుకున్నాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ చిత్రం పర్వాలేదు. మోహన్ చారి కెమెరా వర్క్ , వర్ధన్ నేపథ్య సంగీతంతో పాటు ఇతర సాంకేతిక విభాగాలు అన్ని బాగున్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. 

మరిన్ని వార్తలు