సన్‌ ఆఫ్‌ ఇండియా షురూ

24 Oct, 2020 00:23 IST|Sakshi

డాక్టర్‌ మోహన్‌ బాబు చాలా రోజుల తర్వాత హీరోగా నటిస్తున్న దేశభక్తి కథా చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంచు విష్ణు సతీమణి విరానికా మంచు, కుమార్తె ఐరా, కుమారుడు అవ్రమ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, లక్ష్మీ మంచు, ఆమె కుమార్తె విద్యానిర్వాణ క్లాప్‌ ఇచ్చారు. హీరో విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కలిసి స్క్రిప్టును డైరెక్షన్‌ టీమ్‌కు అందించారు.

‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ టైటిల్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. గతంలో ఎన్నడూ కనిపించని అత్యంత పవర్‌ఫుల్‌ రోల్‌లో మోహన్‌ బాబు నటిస్తున్నారు. ఈ తరహా కథ, ఈ జానర్‌ సినిమా ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ని కూడా శుక్రవారమే మొదలుపెట్టాం. మోహన్‌ బాబు స్వయంగా స్క్రీన్‌ ప్లే సమకూర్చిన ఈ సినిమాకు డైమండ్‌ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్‌ సంభాషణలు రాశారు. సుద్దాల అశోక్‌తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహన్‌ బాబుకు స్టైలిస్ట్‌గా విరానికా మంచు వ్యవహరిస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: సర్వేష్‌ మురారి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు