'తనతో డేటింగ్‌లో ఉన్నవాళ్లనే షాహిద్‌ ఆ షోకి తీసుకెళ్లేవాడు'

29 Aug, 2021 08:25 IST|Sakshi

థప్పడ్‌ సే డర్‌ నహీ లగ్తా సాబ్‌.. ప్యార్‌ సే లగ్తా హై! 
(చెంప దెబ్బంటే భయం లేదు సర్‌.. ప్రేమంటేనే భయం!)
డైలాగ్‌తో పాపులర్‌ అయిన కథానాయిక.. 
అర్థమైపోయి ఉంటుంది ఎవరో?!
అవును.. సోనాక్షీ సిన్హా. 
ఈ వారం ‘మొహబ్బతే’కి నాయిక కూడా!
ఆమె ప్రేమ జీవితం.. అందులో వైఫల్యం.. సాక్ష్యాధారాలతో ఎక్కడా లేవు. హిందీ, ఇంగ్లిష్‌ పత్రికలు, వెబ్‌ మీడియాలో వచ్చిన వార్తలు.. వంటి రూమర్స్‌ని కూర్చి ఇస్తున్న కథనం ఇది. 

ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌. రాజ్‌కుమార్‌’ సినిమా గుర్తుందా? అందులో సోనాక్షీ సిన్హా, షాహిద్‌ కపూర్‌ హీరోహీరోయిన్లు. ఆ సెట్స్‌లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పుకారు. ‘నా జీవితంలో ఇద్దరే ఇద్దరిని ప్రాణప్రదంగా ప్రేమించాను’ అని షాహిద్‌ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా.. ఇంకొకరు సోనాక్షీ అనే నిర్ధారణకొచ్చారు షాహీద్, సోనాక్షీ జంటను అభిమానించే కొంతమంది. ఇందుకు కారణం లేకపోలేదు.

‘కాఫీ విత్‌ కరణ్‌ షో’లో ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి షాహిద్‌ కపూర్‌ ఆ సమయంలో తను ఎవరితోనైతే రిలేషన్‌లో ఉన్నాడో ఆ సహచరితో వచ్చేవాడని.. అలా సెకండ్‌ సీజన్‌లో కరీనా కపూర్, థర్డ్‌ సీజన్‌లో ప్రియాంక చోప్రా, ఫోర్త్‌ సీజన్‌లో సోనాక్షీ సిన్హా, చివరకు భార్య మీరా రాజ్‌పుత్‌తో వచ్చాడని కామెంట్‌ చేశాడు షో హోస్ట్‌ కరణ్‌ జోహార్‌. ఇదే విషయమై షాహిద్‌ను అడిగాడు కూడా.. ‘నువ్వు కరీనా, ప్రియాంకతో డేట్‌ చేశావ్‌ కదా.. సోనాక్షీతో కూడా డేటింగ్‌లో ఉన్నావని రూమర్స్‌ వినిపిస్తున్నాయి’ అని. కాదని తోసిపుచ్చలేదు షాహిద్‌ కపూర్‌.

అంతేకాదు ‘ఆర్‌. రాజ్‌కుమార్‌’ సెట్స్‌లో షూటింగ్‌ తర్వాత సోనాక్షీ, షాహిద్‌ సరదాగా షికారుకెళ్లేవారని, పార్టీలూ చేసుకున్నారనీ బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం. దీనికి ఉదాహరణగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయిన ‘షాహిద్‌ను ముద్దు పెట్టుకుంటున్న సోనాక్షీ సిన్హా’  ఫొటోను చూపిస్తారు. ఇదంతా నిజమే అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు ఎందుకు రాలేదో.. వాళ్లెందకు విడిపోయారో తెలియదు. కానీ వాళ్లిద్దరు మాత్రం విడివిడిగా  ‘మేం మంచి స్నేహితులం.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ’ అని చెప్తారు మీడియా ఎప్పుడు ప్రశ్నించినా! 

ప్యాకప్‌ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్
సోనాక్షీ సిన్హా, అర్జున్‌ కపూర్‌ జంట కలసి నటించిన ‘తేవర్‌’ సినిమా షూటింగ్‌ అప్పుడే వాళ్లు ప్రేమలో పడ్డారని బాలీవుడ్‌ సినిమా పత్రికల కథనం. షూటింగ్‌ ప్యాకప్‌ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్, ముంబై శివారులోని థియేటర్లలో సినిమాలకూ వెళ్లేవారట. ఆ టైమ్‌లో పాపరాజీ కెమెరాలకూ చిక్కారనీ మీడియా కవరేజ్‌. అయితే ‘తేవర్‌’ సినిమా పూర్తవడంతోనే వీళ్ల ప్రేమా ముగిసిపోయిందనీ బాలీవుడ్‌ మాట. ఈ ఇరువురి మనస్తత్వాల్లోని వైరుధ్యమే ఆ బ్రేకప్‌కి రీజన్‌ అని ఇద్దరి సన్నిహితులు చెప్తారు.

సోనాక్షీది అలాంటి తత్వమే..
‘సోనాక్షీ చాలా ఎమోషనల్‌. ఏ ఫీలింగ్స్‌నూ దాచుకోలేదు. బేషరతుగా ప్రేమిస్తుంది. అర్జున్‌ కపూర్‌ ఇందుకు కాస్త భిన్నం. అతను గుంభనంగా ఉంటాడు. సోనాక్షీ స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌ను సంభాళించలేకపోయాడు’ అని ఒక సోర్స్‌ కామెంట్‌. ‘ప్రేమ విషయంలో సోనాక్షీది సాధారణ అమ్మాయిల తత్వమే. అర్జున్‌ చుట్టే తన ప్రపంచాన్ని అల్లుకుంది. ఇది అర్జున్‌ను ఊపిరాడనివ్వకుండా చేసింది.  

ఏమైనా వాళ్ల బ్రేకప్‌కు ఆ ఇద్దరిలో ఎవరినీ బ్లేమ్‌ చేయలేం.. అదలా జరిగిపోయింది అంతే!’ అంటూ ఇంకో సోర్స్‌ విశ్లేషణ. సోనాక్షీ మాత్రం.. ‘సినిమా రంగంలోని అబ్బాయిని కాకుండా కాస్త మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని చూసుకోమని మా పేరెంట్స్‌ చెప్తుంటారు. చూద్దాం.. అలాంటి వ్యక్తి తారసపడితే తప్పకుండా నా ప్రేమ విషయాన్ని ముందు మీకే షేర్‌ చేస్తాను’ అంటూ మీడియా ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకుంటూ ఉంటుందెప్పుడూ!
∙ఎస్సార్‌

మరిన్ని వార్తలు