Sonal Monteiro: విజయ్‌ దేవరకొండ అంటే చాలా ఇష్టం.. తెలుగు ప్రేక్షకులకు నచ్చితే మాత్రం!

1 Nov, 2022 09:49 IST|Sakshi

‘‘మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.. నటనలో మంచి ప్రతిభ చూపిన నటీనటులను కూడా అంతే అభిమానిస్తారు.. వారికి నచ్చితే స్టార్‌ని చేసేస్తారు. అందుకే తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం’’ అని హీరోయిన్‌ సోనాల్‌ మోంటెరో అన్నారు. జైద్‌ ఖాన్, సోనాల్‌ మోంటెరో జంటగా జయతీర్థ దర్శకత్వంలో తిలకరాజ్‌ బల్లాల్‌ నిర్మించిన చిత్రం ‘బనారస్‌’. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. తెలుగులో నిర్మాత సతీష్‌ వర్మ విడుదల చేస్తున్నారు.

సోనాల్‌ మోంటెరో మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ధని అనే పాత్ర చేశాను. కథ నా పాత్ర చుట్టే తిరుగుతుంది. హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో, హీరోయిన్‌కీ అంతే ప్రాముఖ్యత ఉంది. డిఫరెంట్‌ జానర్స్‌ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. జైద్‌ఖాన్‌ మంచి కో స్టార్‌. జయతీర్థ సినిమా బాగా తీశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’, ‘సీతారామం’ సినిమాలు చూశాను. విజయ్‌ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను.. వీటిలో సరోజినీ నాయుడుగారి బయోపిక్‌ కూడా ఉంది.. ఈ మూవీని చాలెంజింగ్‌గా భావిస్తున్నా’’ అన్నారు.

మరిన్ని వార్తలు