సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు

13 Feb, 2024 08:26 IST|Sakshi

ఉత్తరాది భామ సోనియా అగర్వాల్‌ గురించి సినీ వర్గాల్లో తెలియని వారుండరు. ఎందుకంటే అంత సంచలన నటి ఈ భామ. ధనుష్‌ సరసన కాదల్‌ కొండేన్‌, పుదుపేటఐఅట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన్‌ కాలనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో కథానాయికిగా నటించారు. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు సెల్వరాఘవనే. ఆ సమయంలో సెల్వరాఘవన్‌, నటి సోనియా అగర్వాల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి దాంపత్య బంధం ఎక్కువ కాలం సాగలేదు. విభేదాలు కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఎవరి వృత్తిని వారు కొనసాగిస్తున్నారు. అయితే ఆ తరువాత ఈ ఇద్దరిలో ఎవరికీ సరైన హిట్స్‌ లేకపోవడం గమనార్హం.

కాగా ఇటీవల నటుడిగానూ అవతారం ఎత్తిన సెల్వరాఘవన్‌ తాజాగా ఆ వృత్తికి ఫుల్‌స్టాప్‌ పెట్టి మళ్లీ దర్శకత్వంపై దృష్టి పెట్టారు. తను ఆదిలో తెరకెక్కించి సంచలన విజయాన్ని కొట్టిన 7/జీ బృందావన్‌ కాలనీ చిత్రానికి సీక్వెల్‌ తీయనున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా ఆయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన మరో సూపర్‌ హిట్‌ పుదుపేట్టై చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని ప్రకటించారు. అదీ ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాగా పుదుపేట్టై చిత్రంలో ధనుష్‌ సరసన నటి సోనియా అగర్వాల్‌, స్నేహా నటించారు. దీంతో పుదుపేట్టై– 2 చిత్రంలో మీరు నటిస్తారా? అన్న ప్రశ్నకు నటి సోనియా అగర్వాల్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. సెల్వరాఘవన్‌ తో కలిసి పని చేయడానికి తనకెలాంటి సమస్య లేదన్నారు. నటన తన వృత్తి అని, పుదుపేట్టై– 2 చిత్రంలో నటించడం తనకు ఇష్టమేనన్నారు. అయితే ఆ చిత్రంలో నటించే విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. అసలు ఆ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియదని నటి సోనియా అగర్వాల్‌ పేర్కొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు