ఆ పిల్లలకు ఉచిత విద్య అందించాలి: సోనూసూద్‌

30 Apr, 2021 14:04 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోనూసూద్‌ విజ్ఞప్తి

గతేడాది లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు పగలూరాత్రీ తేడా లేకుండా అహర్నిశలు శ్రమించాడు సోనూసూద్‌. కోవిడ్‌ వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఎంతోమందిని స్వస్థలాలకు చేర్చాడు. కానీ ఈసారి సెకండ్‌ వేవ్‌ మానసికంగానే కాదు, శారీరకంగానూ ఎంతోమందిని చిత్రవధ చేస్తోంది. ఆక్సిజన్‌ సిలిండర్లు లేక, ఆస్పత్రిలో కనీసం బెడ్డు కూడా దొరక్క ఎంతోమంది కరోనా పేషెంట్లు నరకం చూస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది నిర్భాగ్యులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారినే నమ్ముకున్న కుటుంబానికి కన్నీళ్లను మిగుల్చుతున్నారు. ఈ విషాద పరిణామాలు సోనూసూద్‌ను తీవ్రంగా కలిచివేశాయి. కరోనా మహమ్మారి వల్ల ఎవరైనా ప్రాణాలు విడిస్తే వారి పిల్లలకు ప్రభుత్వాలు ఉచితంగా చదువు చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్‌ చేశాడు.

A post shared by Sonu Sood (@sonu_sood)

'కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల ఎంతోమంది తనవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. వీరిలో 10 నుంచి 12 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. ఆ మాయదారి వైరస్‌ వారి తల్లిదండ్రులను పొట్టన పెట్టుకోవడం వల్ల వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా విద్య అందించి ఆదుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలైనా, డిగ్రీ, మెడికల్‌ లేదా ఇంజనీరింగ్‌ విద్య అయినా సరే.. వారికి ఫ్రీగా చదువు చెప్పాల్సిందే. అలా అయితేనే వారికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుంది. కాబట్టి కోవిడ్‌ వల్ల కన్నవాళ్లను, కుటుంబాన్ని పోగొట్టుకున్నవాళ్లకు ఉచిత విద్య అందేలా ఓ నిబంధన తీసుకురావాలని ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను' అని సోనూసూద్‌ పేర్కొన్నాడు.

చదవండి: రూ.100 కోట్ల సినిమా కంటే ఇదే ఎక్కువ సంతృప్తి: సోనూసూద్‌

మరిన్ని వార్తలు