భవిష్యత్తు ప్రధాని సోనూసూద్‌.. స్పందించిన నటుడు

12 May, 2021 10:52 IST|Sakshi

కరోనా కష్టకాలంలో అల్లాడిపోతున్న ప్రజలకు తానున్నానంటూ ధైర్యం చెబుతూ ఆపన్నహస్తం అందిస్తున్నాడు నటుడు సోనూసూద్‌. ఆపదలో ఉన్నామని ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు.. క్షణాల్లోనే స్పందించి నిమిషాల వ్యవధిలోనే వారికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సోనూసూద్‌ను భవిష్యత్తు ప్రధానమంత్రిగా చూడాలని కొందరు అభిమానులు కోరుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్ సోనూసూద్‌ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

తాజాగా ఆ వ్యాఖ్యలపై సోనూ స్పందించాడు. మంగళవారం రోజు తన అపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చిన ఫొటోగ్రాఫర్లకు సోనూసూద్‌​ సమ్మర్ డ్రింక్స్ అందించాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తనను దేశానికి ప్రధానిగా చూడాలనుకునే ప్రజల అభిప్రాయలపై స్పందించమని నటుడిని కోరాడు. అనంతరం సోనూ స్పందిస్తూ.. రాజకీయాలపై ఆసక్తి లేదని, సాధారణ వ్యక్తిగా ఉంటూ ప్రజలకు సేవ చేయడానికే ఇష్టపడతానని స్పష్టం చేశాడు.

‘నేను ఒక సామాన్య వ్యక్తిగా బాగానే ఉన్నాను. నా సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికలతో పోరాడటం ద్వారా నేను ఏం పొందుతాను? అది నా పని కాదు.’ అని బదులిచ్చాడు. కాగా, సోనూను ప్రధాని కావాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో రాఖీ సావంత్‌ ఒక్కరే కాదు. కొన్ని రోజుల క్రితం కమెడియన్ వీర్ దాస్ కూడా 2024లో సోనూ సూద్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ప్రచారానికి ట్విట్టర్‌లో వేలాది గొంతులు తోడయ్యాయి. 

చదవండి: నువ్వే దిక్కన్న దర్శకుడు, సాయం చేసిన సోనూసూద్‌

A post shared by Viral Bhayani (@viralbhayani)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు