సలాం సోనూ సూద్‌...మీరో గొప్ప వరం!

24 Apr, 2021 16:05 IST|Sakshi

అంచనాలకు అందని సోనూ ఔదార్యం..

కోవిడ్‌తో తీవ్ర అనారోగ్యంతో  ఉన్న భారతికి సాయం 

నాగపూర్‌నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌

సాక్షి, ముంబై:  ప్రముఖ నటుడు సోనూసూద్‌  సేవా నిరతి గురించి  ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా సంక్షోభం ఆరంభమైంది మొదలు.. తనకు కరోనా సోకిన సమయంలో సేవా కార్యక్రమాలనుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.  తనకు నెగిటివ్‌ వచ్చిందని ట్విటర్‌లో షేర్‌ చేసిన సోనూ.. తాజాగా మరో ఘటనతో వార్తల్లో సంచలన వ్యక్తిగా నిలిచాడు.  కరోనా బారినపడి తీవ్ర అనారోగ్యంతో  బాధపడుతున్న ఒక మహిళ(25)ను  చికిత్స కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఏకంగా ఎయిర్ అంబులెన్స్‌ ద్వారా తరలించి తన మానవత్వానికి ఎల్లలు లేవని చాటుకున్నారు. దీంతో కనిపించే దైవం అంటూ అభిమానులు సోనూసూద్‌ను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నారు.  (శుభవార్త చెప్పిన సోనూసూద్‌)

వివరాల్లోకి వెళ్లితే  రిటైర్డ్ రైల్వే అధికారి కుమార్తె భారతి కోవిడ్-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైనారు. ఆమె ఊపిరితిత్తులు దాదాపు 85 నుండి 90శాతం పాడైపోయాయి. మొదట ఆమెను నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేశాడు సోనూ సూద్‌. అయితే ఆమెకు ఊపిరితిత్తుల మార్పడి అవసరమని వైద్యులు ప్రకటించారు.  అయినా 20 శాతం మాత్రమే బతికే  అవకాశాలు ఉన్నాయని  కూడా వైద్యులు చెప్పారు.  పైగా ఆ అవకాశం ఒక్క  అపోలోలో మాత్రమే ఉంది. అయినా సోనూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. క్షణం ఆలస్యం చేయకుండా  చివరివరకు ప్రయత్నిద్దాం అంటూ అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్లతో సంప్రదించి, ప్రత్యేకమైన ఎక్మో సపోర్టు ద్వారా హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించేందుకు సాయపడ్డారు. అంతేకాదు శరీరానికి కృత్రిమంగా రక్తం పంప్‌ చేసే ఎక్మో చికిత్సలో నిపుణులైన వైద్యబృందాన్ని రప్పించి మరీ ఎయిర్‌ అంబులెన్స్‌లో  ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.  సోనూ  ప్రత్యేకత అదే కదా.  ప్రస్తుతం భారతి చికిత్స పొందుతున్నారు.  కరోనా పోరులో ఆమె నిలిచి గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న అభిమానులు, ఇతర నెటిజనులు రియల్‌ హీరోను ప్రశంసిస్తున్నారు. గ్రేట్ సోనూజీ.. అంచనాలకు అందని మీ మానవత్వం, ఔదార్యం.. మీ మాతృమూర్తి భారతీయులకు అందించిన గొప్పవరం మీరు అంటూ కమెంట్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు