ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగ అభ్యర్థులకు సాయం

5 Nov, 2020 08:53 IST|Sakshi

తల్లి కలను నెరవేర్చేందుకు సిద్ధమైన నటుడు

ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అన్ని ఉద్యోగ అభ్యర్థులకు సాయం

‘సాక్షి’తో ప్రముఖ నటుడు సోనూసూద్‌

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, డాక్టర్, సీఏ’ అవ్వాలనే కోరిక ఉందా? గ్రూప్‌–1 ఉద్యోగం సాధించాలని ఆశతో ముందుకు వెళ్తున్నారా? జీవితంలో మంచి ఉద్యోగంతో స్థిరపడాలని ఎదురు చూస్తూ.. ఉన్నత చదువులు చదివేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారా? ఇకపై మీరు ఆ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతి విద్యార్థి చదువు నా బాధ్యత అంటున్నాడు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌. తన తల్లి జ్ఞాపకార్థంతో స్కాలర్‌ షిప్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ దీనికి అర్హులు అంటూ ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చాడు. ఇది ఎటువంటి స్కాలర్‌షిప్, ఎవరెవరు అర్హులు, ఎలా అర్హత పొందాలనే అంశాలను హీరో సోనూసూద్‌ ‘సాక్షి’తో పంచుకున్న ఆ విశేషాలు మీకోసం. 

తల్లి ఆశయసాధన కోసం.. 
సోనూసూద్‌ తల్లి సరోజ్‌సూద్‌కు చదువు అంటే మహా ఇష్టం. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చదువుకుని ప్రయోజకులు అవ్వాలనేది ఆమె ఆకాంక్ష. తను ఇంట్లో ఉన్న ప్రతిసారీ మనకు ఉన్నదాన్లో మనం పేదవాళ్లకు ఏదో ఒకరకంగా సాయపడాలనేవారు. భౌతికంగా అమ్మ దూరమై 13సంవత్సరాలు అవుతోంది. ప్రతి ఏడాది ఏదో విధంగా విద్యార్థులకు ఆమె పేరుపై సాయం చేయాలని అనుకుంటున్నాను కానీ సాధ్యపడట్లేదు. ఈ ఏడాది ఎలాగైనా సరే అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలనే ఆకాంక్షతో స్కాలర్‌షిప్‌ అనే కొత్త కాన్సెప్ట్‌కి శ్రీకారం చుట్టాను.

అమ్మకు ‘ఐఏఎస్, ఐపీఎస్‌’ అంటే ఇష్టం 
అమ్మకు ఐఏఎస్, ఐపీఎస్‌ అంటే చాలా ఇష్టం. అందుకే అక్టోబర్‌ 13వ తేదీ అమ్మ వర్ధంతి సందర్భంగా ‘సరోజ్‌సూద్‌ స్కాలర్‌షిప్స్‌’ పేరుతో ఐఏఎస్‌ ఆస్పిరెంట్స్‌ రీచ్‌ దెయిర్‌ గోల్స్‌’ అంటూ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టాను. అయితే అందరూ ఐఏఎస్, ఐపీఎస్‌ అవ్వాలనుకోవడం కష్టం కాబట్టి, వాటితో పాటు ఇతర ఉద్యోగాల కోసం చదివే వారికి కూడా అవకాశాలు కల్పించేందుకు మరో పది అడుగులు ముందుకేశాను.  

రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి.. 
మన హైదరాబాద్‌ సిటీతో పాటు అన్ని ప్రాంతాల వారికి స్కాలర్‌షిప్‌ అందిస్తాను. ఏడాది ఆదాయం రూ.2.5లక్షల కంటే తక్కువ ఉన్నవారు అర్హులు. అదేవిధంగా 60శాతం మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. హాస్టల్‌ లాంటివి ఉంటే ఆ హాస్టల్‌ మెస్‌ ఛార్జీలు సైతం అదే స్కాలర్‌షిప్‌ ద్వారా చెల్లిస్తాను. మీరు చేయాల్సిందల్లా మంచి మార్కులు తెచ్చుకోవమే. నేను ఈ సాయం చేస్తున్నందుకు మీరు రానున్న రోజుల్లో విద్యాకుసుమాలుగా నిలబడితే చాలు. 

డబ్బులు లేవని చదువు ఆపొద్దు 
ఇంజినీర్, డాక్టర్, సీఏ, ఆర్డీఓ, ఎమ్మార్వో, బ్యాంక్‌ మేనేజర్‌ ఇలా ఏ ఉద్యోగాన్నైనా సరే సాధించాలనే తపన ఉన్న వారు ధైర్యంగా ఉండండి. 60శాతం మార్కులు సాధించండి, పై చదువుల కోసం నన్ను అడగండి మీ చదువుకు ఎంత ఖర్చు అయితే అంత ఖర్చును స్కాలర్‌షిప్‌ రూపంలో భరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాన్న కూలీ, అమ్మ ఇంటి పని చేస్తుంది.. పూట గడవడానికి డబ్బులు లేవు... ఈ చదువులు ఇక్కడతో ఆపేద్దామనే ఆలోచనలకు మీరు స్వస్తి పలకాలని కోరుతున్నా.. 

‘ఐఏఎస్, ఐపీఎస్‌ అవ్వాలనే ఆశ ఉండి, అందుకు కావాల్సిన డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నవారు భయపడొద్దు. ఇంట్లోని ఆర్థిక పరిస్థితులు చదువుకునేందుకు మీకు అడ్డుగా ఉంటే నాకు చెప్పండి. జస్ట్‌ ఒక్క క్లిక్‌తో నా వెబ్‌సైట్‌లోకి రండి. మీ చదువు వివరాలు, మీ ఆర్థిక వివరాలు తెలియజేయండి. 60శాతం పైమార్కులు వచ్చి, రూ.2.50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడికి స్కాలర్‌షిప్‌ అందించేందుకు నేను మీకు అండగా ఉంటాను. – సోనూసూద్, బాలీవుడ్‌ నటుడు

ఇలా దరఖాస్తు చేసుకోండి.. 
స్కాలర్‌షిప్‌ కావాల్సిన వారు ఈ వెబ్‌సైట్‌ లింక్‌ని ఓపెన్‌ చేసి మీరు పేరు, వివరాలు పొందుపరచాలి. అక్కడ అడిగిన ఆప్షన్స్‌ని ఫిలప్‌ చేసి సబ్‌మిట్‌ చేస్తే.. వెరిఫికేషన్‌ అనంతరం మా టీం నుంచి మీకు స్వయంగా ఫోన్‌ కాల్‌ వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలు మీ నుంచి సేకరించి మీ బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని మీకు స్కాలర్‌షిప్‌లను ప్రతి ఏటా అందిస్తాను.

వెబ్‌సైట్‌: WWW.SCHOLIFYME.CO 
యాప్‌: SCHOLIFYME

మరిన్ని వార్తలు