శివరాత్రి ట్వీట్‌: సోనూసూద్‌పై మండిపాటు

12 Mar, 2021 12:55 IST|Sakshi

సాయం చేయమన్నందుకు  సోనూసూద్‌పై  ట్రోలింగ్‌

హుదహెల్‌ఆర్‌యుసోనూసూద్‌  హ్యాష్‌ట్యాగ్‌తో దూషణ

‘ఐసపోర్ట్‌ సోనూసూద్’ హ్యాష్‌ట్యాగ్‌తో మద్దతు

సాక్షి,ముంబై: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన వేలాది వలస కార్మికులను ఆదుకుని రియల్‌ హీరో నిలిచిన సోనూసూద్‌పై ఇపుడు కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీటే దీనికి కారణం. దీనిపై కొంతమంది హుదహెల్‌ఆర్‌యు సోనూసూద్‌ (#WhoThe Hell AreU SonuSood) హ్యాష్‌ట్యాగ్‌తో దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. మరోవైపు అభిమానులతోపాటు మరికొంతమంది యూజర్లు సోనూసూద్‌కు మద్దతుగా నిలుస్తుండటం విశేషం. (కొత్తవారిని ప్రోత్సహించాలి!)

శివుడి చిత్రాలను ఫార్వార్డ్ చేయడానికి బదులుగా ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మహాశివరాత్రిని జరుపుకోండి అంటూ గురువారం తెల్లవారుజామున సోనూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఆయనపై దూషణలకు దిగారు. మతవిద్వేషాన్ని ఉసిగొల్పేలా కమెంట్‌ చేస్తున్నారు. అయితే గత  ఏడాది దేశంలో కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, వేలాదిమందిని తమ స్వగ్రామాలకు చేరవేయడంతోపాటు, అనేకమందికి విద్యా, వైద్యం కోసం నిరంతరాయంగా సాయం చేస్తున్న దేవుడు సోనూసూద్‌ అంటూ ట్వీట్‌ చేస్తున్నారు. నిజాయితీగల ఇండియన్‌ ఐడల్‌ అంటూ సోనూసూద్‌కు భారీ మద్దతు పలుకుతున్నారు. ఐసపోర్ట్‌ సోనూసూద్‌  అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో నిలిపారు. 

కరోనా కష్టకాలంలో పేదల పాలిట పెన్నిధిగా  అడిగినవారికి కాదనకుండా సాయం చేసే రియల్‌ హీరోగా సోనూ సూద్‌ అవతరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అనేక కార్యక్రమాలతో నిర్మాణాత్మకంగా తన సేవను కొనసాగిస్తున్నారు. ఇక  నటనపరంగా చూస్తే అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ చిత్రంలో చంద్ బర్దాయిగా కనిపించనున్నారు. మానుషి చిల్లార్ సంజయ్ దత్ నటించిన ఈ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ నవంబర్ 5న థియటర్లను పలకరించనుంది. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా, సోనూసూద్‌ కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఆచార్య’ కూడా  ఏడాది మే 13 న విడుదల కానుంది.

కాగా ఇలాంటి ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు సోనూసూద్‌ గతంలోనే గట్టి కౌంటర్‌ ఇచ్చారు. మానవత్వంతో స్పందించి, సాయం చేయడమే తన విధి, ‘సామాన్యుడికి’ మాత్రమే జవాబుదారీగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఈ ట్రోలింగ్‌ వెనుక నేపథ్యం, ఎవరున్నారో తనకు తెలుసు కాబట్టి, వీటికి స్పందించాల్సిన అవసరం లేదని ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.  అంతేకాదు నెగిటివిటీ ట్రోలింగ్‌ చేసేవారి డీఎన్‌ఏలోనే ఉంది .. కానీ నలుగురికీ ఉపయోగపడే పనిచేసుకుంటూ పోవడమే తన పని అని  సోనూ సూద్‌ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు