‘సుశాంత్‌లా చేస్తానేమోనని మా అమ్మ భయం’

6 Aug, 2020 15:04 IST|Sakshi

నటి జియా ఖాన్‌ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను నటుడు సూరజ్‌ పంచోలి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికి దీని విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ ఆత్మహత్యకు, సూరజ్‌ పంచోలికి సంబంధం ఉందనే వార్తలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన వీటి మీద స్పందించారు. ఇవన్ని తప్పుడు వార్తలు‌ అని కొట్టి పారేశారు. ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో సూరజ్‌ పలు విషయాలపై స్పందించారు.

ఈ సందర్భంగా సూరజ్‌ పంచోలి దిశా సలియన్‌ అనే అమ్మాయిని తాను ఇంత వరకు కలవలేదని స్పష్టం చేశారు. అనవసరంగా తనను దిశ కేసులోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్ని తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. ఇప్పటికే తన మీద ఓ కేసు నడుస్తుందని.. దాని వల్ల ఇండస్ట్రీలో అతి కొద్ది మంది మాత్రమే తనతో పని చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వార్తల వల్ల తన జీవితం మరింత నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పంచోలి. జియా ఖాన్‌ కేసు ప్రారంభం అయ్యి ఇప్పటికే 8 సంవత్సరాలు పూర్తయ్యాయని.. కానీ తీర్పు మాత్రం ఇంకా వెల్లడించలేదన్నారు పంచోలి. జియా తల్లి రబియా ఖాన్‌ వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని తెలిపారు. కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికి తాను స్థిరంగా, సానుకులంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఈ విషయాల గురించి తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనని తెలిపారు. ఇప్పటికే వారు తన విషయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని.. వారిని మరింత ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేదన్నారు పంచోలి. (వేధింపులు ఎక్కువయ్యాయి: దిశ తండ్రి)

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య గురించి తెలిసి తన తల్లి ఎంతో భయపడిందన్నారు పంచోలి. తాను కూడా అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటానేమోనని ఆమె ఆందోళన చెందిందని తెలిపారు. దాంతో ఆమె తనను పిలిచి.. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే మాతో చెప్పు. ఏం జరిగినా కూడా ఇలాంటి తీవ్ర నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని ధైర్యం చెప్పారని తెలిపారు పంచోలి. ఇండస్ట్రీలోకి రావడానికి తాను ఎంతో కష్టపడ్డానని వెల్లడించారు పంచోలి‌. ఈ రంగం అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. మానవత్వం లేనివారు, సెన్స్‌ లేనివారే తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా తన జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పంచోలి. (నొప్పిలేని మరణం ఎలా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా