అంతర్జాతీయంగా మరో గుర్తింపు సాధించిన ‘ఆకాశమే నీ హద్దురా’

14 May, 2021 00:00 IST|Sakshi

సూర్య హీరోగా నటించిన ‘శూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) చిత్రానికి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షాంఘై ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (ఎస్‌ఐఎఫ్‌ఐ)లో ప్రదర్శితం కానుంది. ఈ చిత్రోత్సవాలు ఈ ఏడాది జూన్‌ 11 నుంచి జూన్‌ 20 వరకు జరగనున్నాయి. పనోరమ విభాగంలో ‘శూరరై పోట్రు’ చిత్రం ఎంపికయింది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని సుధ కొంగర తెరకెక్కించారు. ఆల్రెడీ 93వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌కు పరిశీలించిన చిత్రాల్లో ‘శూరరై పోట్రు’ ఉన్న విషయం తెలిసిందే. అయితే నామినేషన్‌ దక్కలేదు.

మరో ప్రతిష్టాత్మక ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డ్స్‌కు  కూడా ఈ చిత్రం వెళ్లింది. ఇప్పుడు షాంఘై చలన చిత్రోత్సవాలకు వెళ్లడం ఈ చిత్రానికి దక్కిన మరో గౌరవంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే... మలయాళ చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ కూడా ప్రదర్శనకు ఎంపికైంది. కొత్తగా పెళ్లయిన యువతి అత్తింటివాళ్లు, భర్తకు తగ్గట్టుగా ఒదిగిపోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు–తమిళ భాషల్లో కన్నన్‌ దర్శకత్వంలో రీమేక్‌ కానుంది. ఈ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా నటించనున్నారు.   

చదవండి: సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం

మరిన్ని వార్తలు