స్పృహలో లేరు; నటుడి ఆరోగ్య పరిస్థితి విషమం

26 Oct, 2020 10:24 IST|Sakshi

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం విషమించింది. కరోనా సోకడంతో ఇరవై రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని, ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు. సౌమిత్ర ఛటర్జీని రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నామని, అయితే వయోభారంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా ఆయన కొన్నిసార్లు చికిత్సకు స్పందించడం లేదని తెలిపారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోయిందని, యూరియా, సోడియం స్థాయి విపరీతంగా పెరిగినట్లు వెల్లడించారు. (చదవండి: కరోనా: భారత్‌లో 79 లక్షలు దాటిన కేసులు)

అయితే ఆయన ఊపిరితిత్తులు, గుండె బాగానే పనిచేస్తున్నాయని, కానీ బ్రెయిన్‌ ఫంక్షనింగ్‌ సరిగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూరాలజిస్ట్‌, నెఫ్రాలజిస్ట్‌ బోర్డు ఈరోజు సమావేశమై తదుపరి చికిత్స విధానాల గురించి చర్చిస్తుందని, ఇందుకు సౌమిత్ర ఛటర్జీ కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తే, వెంటనే ట్రీట్‌మెంట్‌ ప్రారంభిస్తామని తెలిపారు. ప్లాస్మామార్పిడి ద్వారా ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు. కాగా కోవిడ్‌ బారిన పడిన సౌమిత్ర ఛటర్జీని అక్టోబరు 6న, కోల్‌కతాలోని బెల్లే వ్యూ క్లినిక్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 85 ఏళ్ల ఈ దిగ్గజ నటుడు గతంలో కాన్సర్‌ బారిన పడి కోలుకున్నారు.

మరిన్ని వార్తలు