సినిమాల కోసం పేరు మార్చుకున్న స్టార్‌ హీరోయిన్లు

30 Sep, 2020 18:28 IST|Sakshi

(వెబ్‌ స్పెషల్‌​): పుట్టగానే అమ్మ నాన్న పేరు పెడతారు. ఆ తర్వాత ముద్దు పేర్లు వచ్చి చేరతాయి. మరి కొందరు వారు చేస్తున్న పనిని బట్టి పేర్లు తెచ్చుకుంటారు. ఆ పేరుతోనే ఫేమస్‌ అవుతారు. ఇక సినీ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇండస్ట్రీలో విజయాలు సాధించాలని కొందరు కొత్త పేర్లు పెట్టుకుంటారు.. మరి కొందరు ఉన్న పేరుకే మార్పులు చేసుకుంటారు. ఇక కొందరికి దర్శకులే నామకరణం చేస్తారు. అలాంటి వారు సొంత పేరుతో కన్నా ఈ పేరుతోనే బాగా గుర్తింపు పొందుతారు. మరి ఇండస్ట్రీలో ఇలా పేరు మార్చుకుని.. స్టార్‌గా ఎదిగిన హీరోయిన్లు ఎవరో చూడండి..

శ్రీదేవి
బాల్యంలోనే ఇండస్ట్రీలో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగి.. ఫిమేల్‌ సూపర్‌ స్టార్‌గా పేరు సంపాదించున్నారు అందాల నటి శ్రీదేవి. అయితే ఆమె కూడా పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు  శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆ తర్వాత శ్రీదేవిగా మారి.. ఇండియాను ఓ ఊపు ఊపేసారు.

జయసుధ
మూవీస్‌లో సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జయసుధ. అయితే ఆమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు సుజాత. (మార్పు అవసరం)

జయప్రద
అందం, అభినయం, నాట్య మయూరి అయిన జయప్రద అసలు  పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్‌లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో రాణిస్తున్నారు.

సౌందర్య
పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగించి ఆడపడుచు అయ్యారు సౌందర్య. టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో అకాల మృత్యువు ఆమెను కబలించింది. సావిత్రిలాగా తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య కూడ ప్రేక్షకుల మదిలో జీవించే ఉంటారు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈమె అసలు పేరు సౌమ్య అనే విషయం అందరికి తెలిసిందే. (రెండు కోట్ల ప్రేమ)

రోజా
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. హీరోయిన్‌గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె కూడా పేరు మార్చుకున్నారు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి.

రంభ
నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల బొమ్మ రంభ. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మీ.   

భూమిక
ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త సినిమాల కోసం భూమికగా మారారు. హీరోయిన్‌గా వచ్చిన కొత్తలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు.  పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (నన్ను నేను తెలుసు కుంటున్నాను)

అనుష్క
ప్రయోగాత్మక చిత్రాలకు.. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అనుష్క. బెంగుళూరుకి చెందిన అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాల్లో తప్ప, బయట ఆమెని అందరు స్వీటి అనే పిలుస్తారు. స్వతహాగా ఈమె యోగ టీచర్. 

నయనతార 
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘చంద్రముఖి’ చిత్రంతో పరిచయం అయిన కేరళ బ్యూటి నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్‌ సినిమాల కోసం నయనతారగా మారింది.

రాశి
రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఆమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవారు. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది. అయితే రాశి అసలు పేరు విజయలక్ష్మి.

ఇక వీరే కాక హీరో రజనీకాంత్‌, చిరంజీవి, సూర్య, పవన్‌ కళ్యాణ్‌, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోలు సైతం పేరు మార్చుకున్నారు. 

మరిన్ని వార్తలు