ఎస్పీ బాలు భౌతికకాయం తరలింపు

25 Sep, 2020 20:31 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. చెన్నైలోని ఆయన స్వగృహం నుంచి తామరైపాక్కంలోని ఫాంహౌస్‌కు బాలు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. రేపు (శనివారం) ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రే వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అంతకుముందు ఆయన నివాసంలో గాన గంధర్వుడిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ‘స్వరస్మారనీయుడి’కి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భారీగా జనం వస్తూనే ఉండటంతో బాలు భౌతికకాయాన్ని  ఫాంహౌస్‌కు తరలించారు. రేపు ఉదయం 7.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభవుతుంది.


గాన గంధ్వరుడి ప్రతిమ
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో శిల్పి రాజకుమార్ వడయార్ శిల్పశాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రూపుదిద్దుకుంటోంది. గాన గంధ్వరుడిని చిరకాలం స్మరించుకునేలా ఈ ప్రతిమకు ప్రాణం పోశారు. రాజకుమార్ వడయార్ ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల కాంస్య విగ్రహాలను తయారు చేసి పేరు సంపాదించారు. ఎంజీఆర్‌, జయలలిత తదితర ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు.

ఇలా జరగడం బాధ కలిగించింది: కైకాల
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సినీపరిశ్రమకు తీరని లోటని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. ఎస్పీ బాలు నేపథ్య గాయకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆరోగ్యం కుదుటపడుతుందనుకున్న సమయంలో ఇలా జరగడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి  తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా