‘ఏ వార్త వినకూడదు అనుకున్నామో.. ’

25 Sep, 2020 15:43 IST|Sakshi

బాలు మృతిపై చిరంజీవి, మోహన్‌బాబు సంతాపం

సాక్షి, హైదరాబాద్‌: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మృతిపై మెగస్టార్‌ చిరంజీవి స్పందించారు. బాలు మరణవార్త కలిచివేసిందని చెప్పారు. సాక్షి టీవితో చిరంజీవి మాట్లాడుతూ.. ‘ప్రపంచ సంగీత చరిత్రలో ఇదొక చీకటి రోజు. బాలు మృతితో ఒక శకం ముగిసిపోయింది. ఎస్పీ బాలు నాకు అన్నయ్య లాంటి వారు. నా విజయాల్లో బాలు పాత్ర ఎంతో ఉంది. సొంత కుటుంబసభ్యుడ్ని కోల్పోయినంత బాధగా ఉంది’అని చిరంజీవి పేర్కొన్నారు. బాలు కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
(చదవండి: బాలు మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి)

‘బాలుగారి విషయంలో ఏ వార్త వినకూడదనుకున్నామో ఆ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ని కోల్పోవడం చాలా దురదృష్ణకరం. ఎంతో బాధగా ఉంది. గుండె తరుక్కుపోతోంది. ఇలాంటి లెజెండరీ పర్సర్‌ని మళ్లీ చూడగలమా. ఘంటసాల గారి తర్వాత అంతటి గాయకుడు మళ్లీ బాలునే. బాలు స్థాయిని భర్తీ చేయాలంటూ ఆయనే పునర్జన్మ ఎత్తాలి.  నాకెరీర్‌లో నా విజయంలో ఆయనకు సింహభాగం ఇవ్వాలి. నా సాంగ్స్‌ అంత పాపులర్‌ కావడానికి కారణం అవి పాడిన బాలునే.  బాలు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. బాలు తను పాడిన పాటల ద్వారా ప్రతిరోజు మన గుండెల్లో ఉంటారు. మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిఉంటారు. అమర్‌ రహే.. బాలు అమర్‌ రహే..’ అంటూ చిరు ట్విటర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎస్పీ బాలు మృతిపట్ల సీనియర్‌ నటుడు మోహన్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు మృతి చాలా బాధాకరమైన విషయమని అన్నారు. సాక్షి టీవీతో మోహన్‌బాబు మాట్లాడారు. బాలు మరణవార్త చీకటి కమ్మినట్టు అయిపోయిందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం ప్రకటించారు. పాటల దిగ్గజం ఎస్పీ బాలు మరణంపై ఆయన స్నేహితులు నాగదేవి ప్రసాద్‌ స్పందించారు. ఎస్పీ బాలు లేక పోవడం బాధాకరమని అన్నారు. బాలు మరణం ప్రపంచానికే తీరని లోటు అని వ్యాఖ్యానించారు.
(చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత)

ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ భాషల్లో ఆయన 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. ‘బాలు గారి మరణం యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని బాలయ్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు