సెప్టెంబరు 25.. విషాదం!

25 Sep, 2020 21:12 IST|Sakshi

చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నసినీ అభిమానులు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మరణమనేది ఖాయమనీ... మిగిలెను కీర్తి కాయమనీ.. నీ బరువూ... నీ పరువూ... మోసేదీ... ఆ నలుగురూ...’’. జీవిత పరమార్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే ఈ పాటకు తన అద్భుత గాత్రంతో ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగారు. వేలాది పాటలు పాడి కోట్లాది మంది అభిమానం చూరగొన్న ఆ యశస్వి అందరినీ శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. శ్రీప‌తి పండితారాధ్యుల బాలసుబ్ర‌హ్మ‌ణ్యంగా జన్మించి ఎస్పీ బాలుగా సుపరిచితులై, సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఎన్నో తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.(చదవండి: నా మావయ్య.. భౌతికంగా లేరంతే: సునీత)

కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆగష్టు 5న ఆస్పత్రిలో చేరిన బాలు, సెప్టెంబరు 25న కన్నుమూశారు. దీంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ‘బాలు’ను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. అంతేగాక గతేడాది సరిగ్గా ఇదే రోజు టాలీవుడ్‌లో చోటు చేసుకున్న మరో విషాదాన్ని తలచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేణుమాధవ్‌ ఈ లోకాన్ని వీడిన రోజు
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని హాస్య నటుడుగా కళామతల్లికి తనవంతు సేవ చేసిన వేణుమాధవ్‌ 2019, సెప్టెంబరు 25న మరణించారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆయన సరిగ్గా ఇదే రోజున కన్నుమూశారు. కాగా అంతకుముందు కొద్ది నెలల క్రితమే వేణు మాధవ్‌ సోదరుడు విక్రమ్‌ బాబు గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కాగా నల్గొండ జిల్లా కోదాడకు చెందిన వేణుమాధవ్‌, 1997లో ‘సంప్రదాయం’ సినిమా ద్వారా సిల్కర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు.  ‘తొలిప్రేమ’ చిత్రం ఆయనకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత కమెడియన్‌గా దూసుకుపోతూ, నవ్వులు పూయించిన ఆయనను, ‘లక్ష్మి’ సినిమాలో నటనకు గానూ నంది అవార్డు వరించింది. కాగా వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా