బాలు ఆరోగ్యం విషమం

24 Sep, 2020 17:51 IST|Sakshi
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయారని, ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందనే వార్త సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం బాలు ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో బాలు గత నెల 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ‘నా ఆరోగ్యం బాగానే ఉంది. ఎవరూ కంగారుపడాల్సిన  అవసరంలేదు. పరామర్శించడానికి ఫోన్లు చేయొద్దని విన్నవించుకుంటున్నాను’అని ఫేస్‌బుక్‌ ద్వారా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అప్పటినుంచి ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.

గత నెల 23న బాలు ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌ ద్వారా ఎక్మో చికిత్స అందిస్తున్నారు. అనంతరం కరోనా నుంచి కోలుకున్నారు. ఆస్పత్రిలో ఉంటూ బాలు పాటలు వింటున్నారని, కొంచెం హుషారుగానే ఉన్నారని చరణ్‌ పేర్కొనడంతో త్వరలో డిశ్చార్జ్‌ అవుతారని అందరూ ఆశించారు. అయితే గురువారం అనుకోని విధంగా ఆయన ఆరోగ్యం విషమించిందని వైద్యబృందం పేర్కొనడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ గురువారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లారు. బాలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్‌లోనే కరోనా సోకిందా? 
వాస్తవానికి స్వల్ప జ్వరం, చిన్న చిన్న అసౌకర్యాలతో బాలు ఆస్పత్రికి వెళ్లారు. అప్పుడు కరోనా అని నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌ సమయంలో చెన్నైలో ఇంటిపట్టునే ఉంటున్న బాలూకి కరోనా సోకింది మాత్రం హైదరాబాద్‌లోనే అని తెలుస్తోంది. ఓ ప్రముఖ ప్రైవేట్‌ చానల్‌ ఆహ్వానం మేరకు ఆయన ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొడానికి హైదరాబాద్‌ వచ్చారు. అప్పుడే ఆయన కరోనా బారిన పడ్డారని సమాచారం. అదే కార్యక్రమంలో పాల్గొన్న పలువురు గాయనీగాయకులకు కూడా కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు లాక్‌డౌన్‌లో కరోనాపై అవగాహన కలిగించేందుకు తమిళ రచయిత వైరముత్తు రాసిన పాటను బాలు స్వరపరచి స్వయంగా పాడారు. ఇది బాగా వైరల్‌ అయింది.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా