-

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

26 Sep, 2020 04:01 IST|Sakshi

51 రోజులుగా చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స

కరోనా నుంచి కోలుకున్నా విషమించిన ఆరోగ్యం

శోకసంద్రంలో అభిమానులు, సంగీత ప్రియులు

నేడు రెడ్‌హిల్స్‌ ఫాంహౌస్‌లో అంత్యక్రియలు

గాన సీమకు రారాజు సింహాసనం దిగిపోయాడు.
పగ్గాలు విడివడ్డ అశ్వాలకు మల్లే ఏడు స్వరాలు
దిశను కోల్పోయి దిక్కులు చూస్తున్నాయి.
పల్లవీ చరణాలను నింపుకున్న తెల్ల కాగితాలు
చిరిగి ఛిద్రమవుతున్నాయి.
అదిగో.. ఆ వంక తలలు మోదుకుంటున్న వాయిద్యాలు..
ఇదిగో.. ఈ పక్క బోరుమంటున్న హార్మోనియం మెట్లు..
ఇంతగా ఘనీభవించిన నిశ్శబ్దం ఎప్పుడూ చూళ్లేదు.
ఇంతటి శోకరాగం ఎప్పుడూ వినలేదు.
‘పరవశాన శిరసూగంగా.. ధరకు జారెనా శివగంగా...’
ఏ అమృత వర్షమో కురిసి పాట కళ్లు తెరిస్తే బాగుండు.
ఏ దైవనాదమో దిగివచ్చి పాటను మేల్కొలిపితే బాగుండు.
ఏ ప్రార్థనా ఫలితమో వెళ్లి సంజీవనిని పెకలించుకు వస్తే బాగుండు.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అను
గాన గంధర్వుడా.. తెలుగునేల గన్న ప్రియపుత్రుడా..
సంగీత శిఖరమా.. లలిత కళాభాండమా..
తెలుగు వారి ఆకాశాన అనంతమైన నీ పాటలను 
తారలుగా గుచ్చి వెళ్లిపోయావా..
సెలవు ధన్యుడా.. సెలవు..
తెలుగు పాట నిన్ను సువర్ణ గండపెండేరంలా ధరించి
సదా వెలుగుతూ ఉండనీ.

సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

51 రోజులపాటు పోరాటం..
ఆగస్టు 5న కరోనాతో ఆస్పత్రిలో చేరిన బాలు ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇతర అనారోగ్య కార ణాలతో ఆరోగ్యం మరింత క్షీణించింది. కరోనా వైరస్‌ సోకినట్లు తేలడంతో బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ‘నాకు కరోనా సోకింది, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఆందోళన, అభిమానాన్ని అర్థం చేసుకోగలను. పరామర్శించేందుకు దయచేసి ఫోన్‌ చేయకండి’అని ఆస్పత్రి నుంచి వాట్సాప్‌ వీడియో విడుదల చేశారు. పది రోజులు సాధారణ స్థితిలో ఉన్న తర్వాత ఆగస్టు 13న ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌ అమర్చారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఎక్మో సహాయంతో చికిత్స అందించారు. నెల రోజులుగా బెడ్‌పైనే ఉండడంతో నడుం కింది భాగం చలనం కోల్పోయింది. దీంతో ఫిజియోథెరపీ ప్రారంభించారు. ఫోన్‌ ద్వారా విదేశీ వైద్యుల సహకారం కూడా తీసుకున్నారు. ఫిజియో థెరపీకి ఆయన శరీరం సహకరించింది. దీంతో క్రమేపీ కోలుకున్నారు. కరోనా పరీక్షలో నెగెటివ్‌ రావడంతో అందరూ ఆనందించారు. ఊపిరితిత్తుల సమస్య నుంచి నాన్న తేరుకున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ ఈ నెల 7న మీడియాకు తెలిపారు. ఈ నెల 5న తన 51వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీమణి సావిత్రిని ఆస్పత్రికి పిలిపించుకుని కేక్‌ కట్‌ చేసి సంతోషంగా గడిపారు. ఆస్పత్రిలో చేరి 50 రోజులు పూర్తయిన దశలో ఈ నెల 23న రాత్రి బాలు ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారు. బ్రెయిన్‌ హెమరేజ్‌ రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన కుటుంబీకులను వైద్యులు హడావిడిగా ఆస్పత్రికి పిలిపించారు. సతీమణి సావిత్రి, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరీమణులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని ఎస్పీ చరణ్‌ ప్రకటించారు.

నేడు అంత్యక్రియలు
చెన్నై ఎంజీఎం ఆస్పత్రి నుంచి శుక్రవారం సాయంత్రం బాలు భౌతికకాయాన్ని స్వగృహానికి తీసుకొచ్చారు. సినీ ప్రముఖులు, సహచరులు, మిత్రులు అప్పటికే బాలు ఇంటికి చేరుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బాలుకు శ్రద్ధాంజలి ఘటించారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి బాలుకు కన్నీటి నివాళులర్పించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు చెన్నై రెడ్‌హిల్స్‌లో ఎస్పీబీకి చెందిన తామరైపాక్కం ఫాంహౌస్‌లో అంత్యక్రియలు జరపాలని తొలుత నిర్ణయించారు. అయితే బాలు ఇంటి వద్దకు చేరుకుంటున్న జన సందోహాన్ని చూసి ప్రభుత్వం కంగారు పడింది. భౌతిక దూరం, మాస్కుల ఆంక్షలను అమలు చేయలేని పరిస్థితి నెలకొనడంతో అందోళనకు గురైన ప్రభుత్వం బాలు పార్థివదేహాన్ని రాత్రికి రాత్రే ఆయన ఫాంహౌస్‌కు తరలించాలని మౌఖికంగా ఆదేశించింది. దీంతో శుక్రవారం రాత్రి 8 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక వాహనంలో ఫాంహౌస్‌కు తరలించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

రాలేను అని అన్నా..
తమిళనాడులో కరోనా వైరస్‌ ప్రబలుతున్న తరుణంలో ఎస్పీ బాలు చెన్నై కమదార్‌ నగర్‌లోని తన స్వగృహంలో అన్ని జాగ్రత్తల మధ్య గడపడం అలవాటు చేసుకున్నారు. తన సినీ జీవిత ప్రస్తానంలో తారసపడిన ప్రముఖుల గురించి రోజుకో వీడియో బులెటిన్‌ విడుదల చేస్తూ కాలం వెళ్లదీశారు. ఇంతలో విధి వక్రించిందో ఏమో.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు టీవీ చానల్‌ నుంచి ఆయనకు కబురొచ్చింది. బాలు నేతృత్వంలో సాగే ఒక ధారావాహిక వీడియో షూట్‌కు హాజరు కావాలని ఆ కబురు సారాంశం. ఒకవైపు కరోనా వైరస్‌ ఉధృతి.. మరో వైపు లాక్‌డౌన్‌ ఆంక్షలు.. వెరసి ‘దయచేసీ ఏమీ అనుకోకండి.. రాలేను’అని ఆయన సున్నితంగా నిరాకరించారు. అయితే ఆ టీవీ చానల్‌ వారు ఒత్తిడి చేశారు. భార్య సావిత్రి, కుమారుడు చరణ్, వ్యక్తిగత కార్యదర్శిని వెంటబెట్టుకుని కారులో హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడి ఆర్కెస్ట్రా ట్రూపులో సుమారు 23 మంది అప్పటికే కరోనా పాజిటివ్‌తో బాధ పడుతున్నట్లు సమాచారం. వీరితో మూడు రోజులపాటు కలిసి కార్యక్రమం పూర్తి చేశారు. తిరిగి చెన్నైకి చేరుకున్న కొద్దిరోజులకే ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఆయన భార్య కూడా కరోనా బారిన పడ్డా, కొద్ది రోజులకే ఆమె కోలుకున్నారు. 
 

పాటల రేడు
సంగీత దిగ్గజం బాలసుబ్రహ్మణ్యం మృతితో దేశం గొప్ప గాయకుల్లో ఒకరిని కోల్పోయింది. అసంఖ్యాక అభిమానులు పాటల రేడుగా పిలుచుకునే ఆయన గాత్రానికి పద్మభూషణ్‌తో సహా పలు జాతీయ అవార్డులు వచ్చాయి. ఎస్పీ కుటుంబానికి, మిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.     –రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 

గానామృతం పంచారు 
ఐదున్నర దశాబ్దాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. గాన గంధర్వుడైన ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచీ చాలా పరిచయముంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.     –ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు 

సమ్మోహిత స్వరం
ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం చిన్నబోయింది. దేశవ్యాప్తంగా సుపరిచితులు. సుమధురమైన ఆయన గాత్రం, శ్రావ్యమైన సంగీతం దశాబ్దాలపాటు శ్రోతలను సమ్మోహితులను చేశాయి. ఈ బాధాతప్త సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఓంశాంతి.    –ప్రధాని నరేంద్ర మోదీ 

చిరస్థాయిగా నిలిచి ఉంటారు 
దిగ్గజ గాయకుడు, సంగీతకారుడు, పద్మభూషణ్‌ బాలసుబ్రహ్మణ్యం మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. మధురమైన గాత్రం, అసమాన సంగీతంతో ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కుటుంబానికి నా సానుభూతి. ఓం శాంతి.     –కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 

సంగీత, కళా రంగాలకు తీరని నష్టం 
బాలు తన అసమానమైన పాండిత్యం, మనోహరమైన గానంతో వివిధ భాషల్లో 40,000 పాటలను పాడటం ద్వారా ఐదు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈ భూమ్మీద సంగీతం ఉన్నంతవరకు ఆయన పాటలు, గానం ప్రజలకు జ్ఞాపకంగా నిలిచిపోతాయి. ఆయన మరణం దేశానికి, సంగీత రంగానికి తీరని నష్టం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి     –గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 


ఆయన లేని లోటు పూడ్చలేనిది 
ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరం. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. –ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 

సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం
గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా    –ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌
∙బాలు కుమారుడు చరణ్‌తో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని అన్నారు.

ఆ స్వరం అజరామరం 
బాలసుబ్రహ్మణ్యం కుటుంబానికి, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పలు భాషల్లో ఆయన పాటలు కోట్లాది మంది మనసులు చూరగొన్నాయి. ఆ స్వరం అజరామరం. ఎస్పీబీ ఆత్మకు శాంతి కలుగుగాక.
– రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేత 

శిఖర సమానుడు 
కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీల్లో నిర్వివాదంగా శిఖరాగ్రానికి చేరారు బాలు. దేశానికి, సంగీతానికి ఆయన మరణం పూడ్చలేని లోటు. 
–మాజీ ప్రధాని దేవెగౌడ 

బహుముఖ ప్రజ్ఞాశాలి 
గొప్ప ప్రజాదరణ పొందిన గాయకుడు. సంగీత దర్శకుడిగా, నటుడిగా రాణించారు. హిందీతో సహా పలు భాషల్లో 40 వేల పైచిలుకు పాటలు పాడారు. సంగీతాభిమానుల గుండెల్లో ఆయన పాటలు చిరకాలం నిలిచిపోతాయి. 
    –బి.ఎస్‌.యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి 

అసమాన గాయకుడు 
సంగీత ప్రపంచానికి తీరనిలోటు. ఎస్పీబీని కేరళీయులు ఎప్పుడూ సొంతవాడిగానే చూశారు. మధురమైన పాటల రూపంలో ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనలో పదిలంగా ఉంటాయి.  ఎస్పీబీ అసమాన గాయకుడు. 
–పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి


భారత సంగీత ప్రపంచానికి ఎస్పీబీ దేవుడిచ్చిన వరం. బాలు పాడిన జయలలిత స్వాగత గీతం అన్నాడీఎంకే పార్టీ చరిత్రలో ఎప్పటికీ విడదీయరాని భాగంగా ఉండిపోతుంది. పలు భక్తి గీతాలతో అసంఖ్యాక భక్తుల హృదయాలను 
గెల్చుకున్నారు.     –పళనిస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి 

కుటుంబంలో ఒకరిని కోల్పోయాం 
నాతో పాటు కోట్లాది మంది అభిమానులు కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్లు భావిస్తున్నాం. పాటల రూపంలో ఆయన చిరంజీవిగా నిలిచిపోతారు. ఉరుకులపరుగులు ఈ ప్రపంచంలో ఎస్పీబీ పాటలు గొప్ప ఉపశమనం కలిగిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.     –ఎం.కె.స్టాలిన్, డీఎంకే అధినేత 

దిగ్గజాన్ని కోల్పోయాం 
సంగీత సామ్రాజ్యపు దిగ్గజం ఇక లేరనే వార్త కలచివేసింది. బాలసుబ్రహ్మణ్యం అద్భుత గాత్రం తరతరాలకు నిలిచిపోతుంది. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.   –మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి  

సంగీతానికి ఎల్లలు లేవు... 
గాయక ప్రపంచంలో బాలసుబ్రహ్మణ్యం ఓ అద్భుతం. ప్రాంతాలు, భాషలకు సంగీతం అతీతమని తన సుమధుర గాత్రంతో ఆయన నిరూపించారు. కాలం ఆయనను మనకు దూరం చేసి ఉండొచ్చు... కానీ పాట రూపంలో అమరత్వం పొందారు.     – ఉద్ధవ్‌ థాక్రే, మçహారాష్ట్ర ముఖ్యమంత్రి 

తెలుగు జాతి ముద్దుబిడ్డ 
బాలు.. తెలుగుజాతి ముద్దుబిడ్డ. ఆయన మృతి భారత చలనచిత్ర పరిశ్రమకే కాకుండా కళాకారులకు, యావత్‌ సంగీత ప్రపంచానికి తీరని లోటు. గిన్నిస్‌ బుక్‌ రికార్డులకు ఎక్కి తెలుగు జాతి ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేశారు.      – చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత 

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర ఎస్పీబీ 
బాలసుబ్రహ్మణ్యం మరణం భారతీయ సినీ రంగానికి తీరని లోటు. బహు భాషల్లో వేలాది పాటలు పాడి దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయ న మధురమైన పాటలు ఎప్పటికీ మోగుతూనే ఉంటాయి.అశ్రునయనాలతో నివాళితో పాటు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. 
–టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  

బాలు లేని లోటు పూడ్చలేనిది
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సినీ, సంగీత రంగానికి పుడ్చలేని లోటు.  నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ భాషల్లో అనేక పాటలకు బాలు ప్రాణం పోశారు. బాలు కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి  –తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఎండీ అర్వింద్‌ కుమార్‌  

మరిన్ని వార్తలు