బాలు మరణం: ప్రముఖుల నివాళి

25 Sep, 2020 14:02 IST|Sakshi

టాలీవుడ్‌లో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు సినీ ఇండస్ట్రీని చీకట్లోకి నెట్టేస్టున్నాయి. సెలబ్రిటీల ఆకస్మిక మరణాలు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తున్నాయి. తాజాగా గాన గందర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రాణాలు విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే బాలుని కొలిచే అనేక హృదయాలు షాక్‌కు గురయ్యాయి. ఎప్పటికైనా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఇన్ని రోజులుగా ఎదురు చూసిన వారికి బాలు మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. (బ్రేకింగ్‌ : ఎస్పీ బాలు కన్నుమూత)

తన గాత్రంతో లక్షల పాటలను పలికిన ఆ స్వరం నేడు మూగబోవడంతో ఎస్పీబీకి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తన స్వరంతో కోట్లాది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప గాయకుడికి ట్విటర్‌ వేదికగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. గాన గంధర్వుడు ఇక లేరని చిత్ర నిర్మాత బీఏ రాజు తెలిపారు. ‘లెజండరీ గాయకుడు ఎస్పీబీ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సినీ ఇంస్ట్రీకి తీరనిలోటు.. బాలు కుటుంబానికి నా సంతాపం’ అని ట్వీట్‌ చేశారు.

ఓ శకం ముగిసింది
‘సంగీత ప్రపంచానికి చీకటి రోజు. బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. ఆయన అందించిన పాటల కారణంగా నా ఎన్నో సినిమాలు విజయం సాధించాయి. ఎన్నో మరుపురాని పాటలను అందించారు. ఆయన స్వరంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. బాలు స్థానాన్ని ఎవరూ పూడ్చలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

‘ఆగిపోయింది మీ గుండె మాత్రమే. మీ గొంతు కాదు. మీరెప్పుడు మాతోనే ఉన్నారు. ఉంటారు.’ - హరీష్‌ శంకర్‌ 

‘నా కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు.. మిమ్మల్ని మి్‌ అవుతున్నాం మామా’.. - తమన్

‘తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ, పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.’ - జూ. ఎన్టీఆర్‌

నమ్మలేకపోతున్నాను
బాల సుబ్రహ్మణ్యం మన మధ్య లేరు అన్న వార్తను నమ్మలేకపోతున్నాను. మీ ఆత్మకు శాంతి చేకురాలి. మీ పాటలు చిరస్మరణీయం, బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. -మహేష్‌ బాబు

వైజాగ్: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. తెలుగు జాతి గర్వించదగ్గ గాయకుడు. నాకు మంచి సన్నిహితుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
- కేంద్ర మాజీ మంత్రి  టి. సుబ్బరామిరెడ్డి

మరిన్ని వార్తలు