మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు

26 Sep, 2020 05:11 IST|Sakshi

‘నన్ను పెట్టి సినిమా తీస్తే హిట్‌ అవ్వొచ్చు.. ఫ్లాప్‌ అవ్వొచ్చు... ఆలోచించుకో వసంత్‌’ అన్నారు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం. వసంత్‌ అంటే దర్శకుడు కె.బాలచందర్‌ అసిస్టెంట్‌. ‘కేలడి కన్మణి’ (1990) అనే సినిమా కథ రాసుకుని అందులో బాలు లీడ్‌ రోల్‌ చేస్తే బాగుంటుందనుకున్నారు. ‘ఫెయిల్‌ అయితే నాకేం కాదు. నీకిది ఫస్ట్‌ సినిమా’ అని హెచ్చరించారు బాలు. కానీ వసంత్‌ వినలేదు. బాలూతోనే తీశారు. ‘కేలడి కన్మణి’ సూపర్‌ హిట్‌ అయ్యింది. 285 రోజులు ఆడింది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో బాలు ఈ సినిమా కోసం ఊపిరి బిగపట్టినట్టు పాడిన (అది కంప్యూటర్‌ మిక్సింగ్‌) ‘మాటే రాని చిన్నదాని..’ పాట ఓ సంచలనం. ఈ సినిమా తెలుగులో ‘ఓ పాపా లాలి’ పేరుతో విడుదలై, ఇక్కడా మంచి విజయాన్ని అందుకుంది. నటుడిగా బాలు సామర్థ్యాన్ని చూపిన సినిమా అది.

బాలూకి నటన తెలుసు. కాలేజీ రోజుల్లో ఆయన నాటకాలు వేశారు. సినిమాల్లో సరదాగా ఎప్పుడైనా కనిపించవచ్చని భావించారు. కాని హిందీలో హిట్‌ అయిన ‘పడోసన్‌’ సినిమా తెలుగులో ‘పక్కింటి అమ్మాయి’గా తీస్తున్నప్పుడు హిందీలో గాయకుడు కిశోర్‌ కుమార్‌ చేసిన పాత్రను తెలుగులో బాలు చేశారు. ఆ సినిమాలో ‘చిలుకా పలుకవే’ పాట పాడుతూ కనిపిస్తారు. బాలు చాలా సినిమాల్లో ‘బాలు’ హోదాలో కనిపించారు. కొన్ని సినిమాల్లో పాత్రలుగా మారారు. వెంకటేష్‌ హిట్‌ చిత్రం ‘ప్రేమ’లో బాలుది చాలా సరదా పాత్ర. వెంకటేష్‌కు ధైర్యం చెప్పే పాత్ర అది. ‘వివాహ భోజనంబు’ సినిమాలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా రాజేంద్రప్రసాద్‌తో ఆయన నవ్వులు పూయిస్తారు. కాని తెలుగులో దాసరి నారాయణరావు, బాలు ముఖ్యపాత్రలుగా ‘పర్వతాలు పానకాలు’ (1992) తీసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.

ఇద్దరు భిన్నరంగాల ఉద్దండులు నటులుగా చేసిన సినిమా ఇది. బాలు నటనను మణిరత్నం భిన్న కోణంలో ఉపయోగించుకున్నారు. ‘దొంగ దొంగ’ (1993) సినిమాలో క్యాజువల్‌గా, పైకి జోక్‌ చేస్తూ లోన సీరియస్‌గా పని చేసే íసీబీఐ ఆఫీసర్‌గా బాలు కనిపిస్తారు. తుపాకులు, నల్లకళ్లద్దాలు ఉండే íసీబీఐ ఆఫీసర్లు తెలిసిన మనకు మామూలు చొక్కా ప్యాంట్‌లో ఉండే అలాంటి ఆఫీసర్‌ను చూడటం కొత్త. డైరెక్టర్‌ శంకర్‌ బాలూకి ‘కాదలన్‌’ (1994)లో ప్రభుదేవా తండ్రి పాత్ర ఇచ్చారు. అందులో ప్రభుదేవాతో కలిసి ‘అందమైన ప్రేమరాణి’ పాటకు డాన్స్‌ చేశారు బాలు. అదే సంవత్సరం భక్తి చిత్రం ‘దేవుళ్లు’లో వినాయకుడి పాత్ర చేశారు బాలు. ‘ఉల్లాసమ్‌’ (1997) అనే తమిళ సినిమాలో కొడుకు జీవితం ఏమైపోతుందోననే బాధతో నిద్రలేని రాత్రులు గడిపే తండ్రి పాత్ర బాగా పండించారు బాలు.

అయితే ‘పవిత్రబంధం’ (1996), ‘ఆరోప్రాణం’ (1997) చిత్రాలు బాలూని మంచి తండ్రి పాత్రల్లో చూపించాయి. ‘పవిత్ర బంధం’లో వెంకటేష్‌ తండ్రిగా బాలు చేసిన పాత్ర ఎంత హిట్‌ అంటే ఆ సినిమాల తమిళ, కన్నడ రీమేకుల్లో బాలూయే నటించారు. ‘ఆరో ప్రాణం’లో వినీత్‌ తండ్రిగా నటించారు బాలు. ఇక 1996లో విడుదలైన చిత్రాల్లో ‘కాదల్‌ దేశం’ (ప్రేమ దేశం) సెన్సేషనల్‌ హిట్‌. ఇందులో టబు తండ్రిగా నటించారు బాలు. ఓ త్రీడీ సినిమాలోనూ నటించారు బాలు. అది తమిళ చిత్రం ‘మ్యాజిక్‌ మ్యాజిక్‌ త్రీడీ’ (2003). ఇందులో ఆయన ఇంద్రజాలికుడిగా చేశారు.
 
బాలు లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రాల్లో ‘దేవస్థానం’ (2012) గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కళాతపస్వి కె. విశ్వనాథ్, బాలు ముఖ్య తారలుగా జనార్దన మహర్షి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. పురాణాలు తెలిసిన విశ్వనాథ్‌ దేవాలయాల్లో భక్తులు అడిగే సందేహాలను నివృత్తి చేస్తుంటాడు. తన తర్వాత ఆ స్థానానికి బాలు కరెక్ట్‌ అనుకుంటాడు. ఆ పని చేయడానికి ముందు నిరాకరించి, తర్వాత విశ్వనాథ్‌ బాటలో వెళతాడు బాలు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడే అనుబంధం ప్రేక్షకుల హృదయాలను కదిలించి వేసింది. అలాగే అదే ఏడాది బాలు చేసిన చిత్రం ‘మిథునం’ (2012). తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలు–లక్ష్మి జీవించారనే చెప్పాలి. ఆ తర్వాత బాలు–లక్ష్మీ ‘మూనే మూను వార్తయ్‌’ (మూడు ముక్కల్లో చెప్పాలి) అనే తమిళ సినిమాలోనూ నటించారు. ఈ చిత్రానికి బాలు తనయుడు, గాయకుడు చరణ్‌ నిర్మాత.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బాలు దాదాపు 75 చిత్రాల్లో నటించారు. నటుడిగా తనదైన మార్క్‌ని చూపించారు. కన్నడంలో ‘బాలోందు చదురంగ’, ‘తిరుగుబాణ’, ‘ముద్దిన మావ’, ‘మాంగల్యం తంతునానేన’ తదితర చిత్రాల్లో నటించారు. హిందీలో నేరుగా చిత్రాలు చేయకపోయినా ప్రేమదేశం, రాక్షసుడు వంటివి హిందీలో అనువాదం కావడంతో ఆ చిత్రాల ద్వారా హిందీ తెరపై కనిపించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా