బాలు ఫామ్‌హౌజ్‌లో రేపు అంత్యక్రియలు

25 Sep, 2020 14:47 IST|Sakshi

సాక్షి, చెన్నై : భారతీయ దిగ్గజ గాయకుల్లో ఒకరైన ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. 17 భాషల్లో 41 వేల 230 పాటలు పాడిన బాలు తమను వదిలి వెళ్లాడనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1966, డిసెంబర్‌ 15న ప్లేబ్యాక్ సింగర్‌గా తనన ప్రస్తానాన్ని ప్రారంభించిన బాలు.. వివిధ విభాగాల్లో 25 నంది పురస్కారాలను అందుకుని అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రాణాంతక కరోనా బారినపడిన కోలుకున్నప్పటికీ.. అనారోగ్యం మళ్లీ తిరగబెట్టడంతో గురువారం సాయంత్రం నుంచి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్నాహ్యం తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు చరణ్‌ ప్రకటించారు. (ఎస్పీ బాలు కన్నుమూత)

ఎస్పీ బాలు మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన స్వగృహాని​కి బాలు భౌతిక కాయాన్ని తరలించారు. రాత్రి 9 గంటలకు భౌతిక కాయాన్ని స్వగృహం నుంచి ఫాంహౌస్‌కు తరలిస్తారని సమాచారం. రేపు ఉ.10:30 గంటలకు తామరైపాక్కం ఫాంహౌస్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి.  ఇక బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కడసారి చూపు కోసం అక్కడికి చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.  (జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’)

>
మరిన్ని వార్తలు