ఆసుపత్రి బిల్లుల వివరాలు త్వరలోనే వెల్లడి: ఎస్పీ చరణ్‌

28 Sep, 2020 15:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం అనేక వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది బాలుకు సరిగా వైద్యం అందించలేదని, అంతేకాకుండా మొత్తం బిల్లు చెల్లిస్తే తప్ప మృతదేహాన్ని అప్పగించమని ఆయన కుటుంబాన్ని వేధించినట్లు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. వాటిని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఖండించారు. సోషల్ ‌మీడియాలో అయిదు నిమిషాల నిడివిగల ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో బాలసుబ్రహ్మణ్యం వైద్యానికి సంబంధించిన బిల్లులను త్వరలోనే వెల్లడిస్తానని, దాంతో అందరికి ఈ వదంతులపై ఒక అవగాహన వస్తుందని అన్నారు. 

ఆస్పత్రి సిబ్బంది వైఫల్యం ఏం లేదని చరణ్‌ స్పష్టం చేశారు. ఈ విషయంపై చరణ్‌ మాట్లాడుతూ, ‘అసలు ఇలాంటి విషయాన్ని ఎవరు సృష్టిస్తారో అర్థం కావట్లేదు. అలాంటి మాటలు ఎంతమందిని బాధపెడతాయో వాళ్లకు తెలియడం లేదు. ఇలాంటి ప్రచారం చేస్తోంది కచ్ఛితంగా బాలసుబ్రహ్మణ్యం అభిమానులు కాదు. ఎందుకంటే నాన్న ఎప్పటికీ ఇలా చేయరు. ఆయన అభిమానులు కూడా ఇలా చేయరు. ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తారు. అలాగే ఇలా ప్రచారం చేసే వాళ్లని నేను కూడా క్షమిస్తున్నాను’ అని తెలిపారు. 

ఇక బాలసుబ్రహ్మణ్యం మరణించే సమయానికి ఆసుపత్రికి 1.85కోట్ల రూపాయిలు చెల్లించాల్సి ఉందని, మొత్తం బిల్లు 3 కోట్ల పైనే అయ్యిందని ప్రచారం జరుగుతోంది. బ్యాలెన్స్‌ డబ్బులు చెల్లిస్తే కాని మృతదేహాన్ని అప్పగించమని ఆసుపత్రి సిబ్బంది బాలు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిందని ఫేక్‌న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ఇక ఈ విషయంలో బాలు కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వ జోక్యాన్ని కోరగా పళనిస్వామి ప్రభుత్వం స్పందించలేదని, తరువాత జాతీయ స్థాయిలో సంప్రదించగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె ఆసుపత్రి బిల్లులు చెల్లించడంతో ఆసుపత్రి సిబ్బంది బాలు మృతదేహాన్ని అప్పగించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను ఎస్పీ చరణ్‌ ఖండించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి బిల్లుల వివరాలను వెల్లడిస్తానని సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియోలో చరణ్‌ పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు