మా పాటల్లో ‘మాటే మంత్రము’  ఎంతో ఇష్టం 

11 Oct, 2020 12:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అన్నయ్యకు చెల్లెలు కావడం అనే అదృష్టాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు గానంలోనూ, గాత్ర  దానంలోనూ ఆ పాటసారికి వారసురాలిగానూ తనను తాను నిరూపించుకున్నారు ప్రముఖ గాయని ఎస్పీ శైలజ.   జీ తెలుగులో ప్రసారమయ్యే ‘జీ సరిగమప’ న్యాయ నిర్ణేతగా  వ్యవహరిస్తూ నగరానికి రాకపోకలు సాగించే ఈ మధురగాయని అన్నయ్యతో తన అనుబంధం గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆమె ఏమన్నారంటే..

అన్నయ్యతో మధుర క్షణాలు ఎన్నో ఎన్నెన్నో.. ఎన్నని పంచుకోను? ఎత్తుకుని పెంచాడు. వేలుపట్టి నడిపించా డు. ఎలా మాట్లాడాలి? ఎలా పాటలు పాడాలి? అని మాత్రమే కాదు.. ఎలా నడుచుకోవాలో కూడా నేర్పించాడు. తొలి కచేరీ అన్నయ్యతో కలిసి పాడిన సమయంలో చాలా చిన్నదాన్ని. నాకు భయం ఉండేది కాదు. అన్నయ్య మాత్రం నా విషయంలో గాభరాపడేవాడు. తనెలా పాడుతుందో ఆని భయపడేవాడు. తర్వాత తర్వాత నామీద నమ్మకం వచ్చింది తన కి. ఆయనతో కలిసి వేల కచేరీ లు చేశాను. ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. ఒకో అనుభవం. ప్రతి కచేరీ ముందు స్ట్రిక్ట్‌గా సాధన చేయించేవాడు. అంత పెద్ద ఆర్టిస్టయినా ఎన్ని వేల కచేరీలు చేసినా ప్రతి కచేరీనీ అదే మొదట కచేరీగా భావించేవాడు. స్టేజీ మీదకు వెళుతూ ‘నాకు మొదటి పాట పాడేంత వరకూ ఈ చాలా కంగారుగా, భయంగా ఉంటుంది నీకెలా ఉంది? అనేవాడు. నేనేమో..‘స్టేజ్‌ ఎక్కా క ఇంక చేసేదేముంది? పాడేసేయడమే భగవంతుడే చూసు కుంటాడు’ అనేదాన్ని. ఆ తర్వాత అర్థమైంది. అది అవసరమైన భయం అని. అన్నయ్య ప్రతి కచేరీకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చేవాడు. అవన్నీ మేం చూసి నేర్చుకున్నాం.

ఆయన పొగిడితే.. ఆ ఆనందమే వేరు.. 
నేను.. చరణ్‌.. పల్లవి.. మా సిస్టర్స్‌.. ఇలా ఎవరైనా ఏదై నా పని మీరు బాగా చేశారు అని అన్నయ్య అంటే చాలు పెద్ద అవార్డు వచ్చినంత ఆనందపడేవాళ్లం. ఎందుకంటే సామాన్యంగా తను లోలోపల ఆనందిస్తాడు గానీ బయటకు చెప్పుకోడు. నువ్విలా చేశావ్‌. బాగా పాడావు అని చాలా రేర్‌గా పొగిడేవారు. అలాంటి అరుదైన ఆనందాలు జీవితంలో నాకు చాలా దక్కాయి. అంత మాత్రా న సాధన సమయంలో ఆయనెప్పుడూ కోప్పడ్డం కూడా చూడలేదు. కోప్పడితే అవతలి ఆర్టిస్ట్‌ మూడ్‌ డిస్ట్రబ్‌ అవుతుందని ఆయనకు తెలుసు. ఇది సరిచేసుకో అది సరిచేసుకో.. కొంచెం ఎక్స్‌ప్రెషన్‌తో ఓపికగా సలహాలు ఇచ్చేవాడు. ఒక్క చూపుతో మన ప్రవర్తన ఏమిటనేది చెప్పగలిగేవాడు. మరీ ఇంత పర్ఫెక్షనిస్ట్‌ ఏమిటీయన అనుకునే దశ నుంచి వాటన్నింటినీ తిరిగి అలాగే పాటించే దశకు చేరుకున్నాం. ఇప్పుడు జీ సరిగమన లాంటి పోటీల్లో జడ్జిగా.. ఆ సూచనలే స్ఫూర్తి. మేం కలిసి పాడిన పాటలన్నీ నాకిష్టమే. మరీ ముఖ్యంగా ‘మాటే మంత్రము’తోపాటు ‘సాగర సంగమం’లో పాడిన పాటలు బాగా ఇష్టం. 

గుండెల్లో భద్రంగా..
ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తనే కారణం. ఇంకా మున్ముందుకు సాగాలంటే కూడా తనే కారణం కావాలి. తనే ఆ ధైర్యం నింపాలి. ప్రస్తుతం శూన్యంలో ఉన్నట్టున్నాం. ఆయన ఆ ఖాళీని భర్తీ చేసి మాలో తను నిండి మమ్మల్ని తన బాటలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. అన్నయ్య మధుర జ్ఞాపకాలు మాత్రమే గుర్తుంచుకుని ఆయన లేడనే బాధ నుంచి మేం కోలుకుంటున్నాం. ఒకప్పుడు భౌతికంగా మాతో ఉన్నా ఇప్పుడు విశ్వమంతా వ్యాపించి మాతోనే నడుస్తున్నాడు అనే ధైర్యం మాకుంది. ఆయన ఎప్పుడూ మా పక్కనే ఉంటాడు. మాతో తనుంటాడు. ఈ సమయంలో పూజలు, ప్రార్థనలతో ఎంతో మద్దతు ఇచ్చిన బాలూ అభిమానులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ గుండెల్లో ఆయనను భద్రపరచుకున్నారు. ఇలాగే మీలో.. మాలో ఆయన నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మరిన్ని వార్తలు