Pranitha Subhash: 'కాజల్‌ యోగా వీడియోలు చూశాను..నేను కూడా ప్లాన్‌ చేస్తాను'

12 Apr, 2022 07:56 IST|Sakshi

సెకండ్‌ లాక్‌డౌన్‌ (గత ఏడాది)లో వెడ్‌ లాక్‌ (2021 మే 30)లోకి ఎంటరయ్యారు ప్రణీత. వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ఆమె వివాహం జరిగింది. సోమవారం (ఏప్రిల్‌ 11) సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో ఓ తీపి కబురు పంచుకున్నారు ప్రణీత. తల్లి కాబోతున్న విషయాన్ని తెలియజేసి, స్కానింగ్‌ కాపీని చూపిస్తూ భర్తతో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేశారామె. ఈ సందర్భంగా ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్‌ చిట్‌ చాట్‌. 

పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. తల్లి కాబోతున్న విషయాన్నీ సోషల్‌ మీడియా ద్వారానే ప్రకటించారు..(నవ్వేస్తూ).. నాకు సింపుల్‌ వెడ్డింగ్‌ అంటే ఇష్టం. అందుకు తగ్గట్టుగా అప్పుడు లాక్‌డౌన్‌ కూడా. అందుకే మాకు నచ్చినట్లు దగ్గర బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాం. హడావిడి లేకుండా మా పెళ్లి ప్రశాంతంగా జరిగింది.

ఇప్పుడు తల్చుకున్నా చాలా స్వీట్‌గా ఉంటుంది. ఇక నా లైఫ్‌లో జరిగే ప్రతి మంచి విషయాన్ని నా ఫ్యాన్స్‌కి తెలియజేయాలనుకుంటాను. అందుకే అప్పుడు పెళ్లి, ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాను. 2021లో పెళ్లితో లైఫ్‌లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకో కొత్త చాప్టర్‌. ఈ కొత్త ఫీలింగ్‌ గురించి... 
నిజంగా మాటల్లో చెప్పలేని ఫీలింగ్‌ ఇది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకున్నాను. నితిన్‌కి చెప్పాను. మా అమ్మవాళ్లకి, అత్తమామలకు చెప్పేటప్పుడు మాత్రం బిడియంగా అనిపించింది. నాకు నేను కొత్తగా అనిపించాను. అలానే వేరే ఫ్రెండ్స్‌తో కూడా సిగ్గుపడుతూ మాట్లాడాను. 

మీ అమ్మగారు గైనకాలజిస్ట్‌ కాబట్టి గైడెన్స్‌ విషయంలో మీకు ఇబ్బంది ఉండదు...
అవును. అమ్మ సలహాలు తీసుకుంటాను. ఏం తినాలి? ఏం తినకూడదు? అని చాలామంది చెప్పారు. నాకు వామిటింగ్, వేరే ఏ ఇబ్బందులు లేవు. అందుకని ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకునేంతవరకూ నేను ప్రెగ్నెంట్‌ అని కన్‌ఫార్మ్‌గా తెలుసుకోలేకపోయాను. మామూలుగా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బొప్పాయి, పైనాపిల్‌ తినకూడదంటారు. కానీ టెస్ట్‌ చేసుకోకముందు కొన్ని రోజులు ఈ రెండూ బాగానే తిన్నాను. థ్యాంక్‌ గాడ్‌... ఏమీ కాలేదు. 


ఇప్పుడు ఎన్నో నెల? 
అది మాత్రం సస్పెన్స్‌. డెలివరీ ఈ సంవత్సరమే. 

ప్రెగ్నెన్సీ టైమ్‌లో చేసే యోగా,  ఎక్సర్‌సైజ్‌లవీ ప్లాన్‌ చేసుకున్నారా? 
ఇంకా లేదు. కొన్ని రోజులు మెల్లిగా నడవాలనుకుంటున్నాను. ఆ తర్వాత యోగా వంటివి ప్లాన్‌ చేస్తాను. ఈ మధ్య కాజల్‌ అగర్వాల్‌ (ప్రస్తుతం కాజల్‌ గర్భవతి) యోగా చేస్తూ పెట్టిన వీడియోలు చూశాను. కొన్ని రోజుల తర్వాత నేనూ అవి చేయాలనుకుంటున్నాను. 

ఇప్పుడు ఏమేం తినాలనిపిస్తోంది? 
ప్రస్తుతానికి నాకు చాక్లెట్లు, ఐస్‌క్రీములు తినాలనిపిస్తోంది. ఇంతకుముందూ తినేదాన్ని కానీ ఇప్పుడు ఈ రెండింటి మీద మనసు బాగా లాగుతోంది. అయితే నా ఆరోగ్యం, బేబీ ఆరోగ్యం కోసం కొంచెం కంట్రోల్‌ చేసుకుంటాను. ఇంకా డైట్‌ ప్లాన్‌ చేయలేదు... చేయాలి. 

పాప కావాలా? బాబు పుట్టాలనుకుంటున్నారా? 
మా ఇద్దరికీ (భర్త నితిన్‌ రాజు) ఎవరైనా ఓకే..  ప్రస్తుతం ఓ కన్నడ సినిమా చేస్తున్నట్లున్నారు.. లక్కీగా ఆ సినిమా షూటింగ్‌ పూర్తయింది. 

సినిమాలు కంటిన్యూ చేస్తారా? 
తప్పకుండా. ఇప్పుడు కూడా ఏమైనా యాడ్స్‌కి అవకాశం వస్తే చేస్తాను. సినిమాలు వదిలే ప్రసక్తే లేదు. 

ఫైనల్లీ.. కంగ్రాట్స్‌ ప్రణీత... టేక్‌ కేర్‌.. 
థ్యాంక్యూ సో మచ్‌. ఓ కొత్త ఫీలింగ్‌తో నా ఫీలింగ్స్‌ని షేర్‌ చేసుకున్నాను. ‘ఐయామ్‌ వెరీ హ్యాపీ’.   

మరిన్ని వార్తలు