డ్రగ్స్‌ కేసులో కన్నడ హీరోయిన్లకు షాక్‌

28 Sep, 2020 18:00 IST|Sakshi

బెంగుళూరు: సినీ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలకు ఎన్‌డీపీఎస్‌ స్పెషల్‌ కోర్టు షాక్‌ ఇచ్చింది. శాండిల్‌వుడ్‌ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వీరిద్దరు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించగా స్పెషల్‌కోర్టు వీరి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక వేరు వేరు ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ సేకరించి వాటిని ఫైవ్‌ స్టార్‌ హోటలల్లో, క్లబ్స్‌లో, పబ్‌లలో సంజన టీం అమ్మేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మొదట తయారు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంజనా పేరు లేదని ఆమె తరుపు న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు. కేవలం డ్రగ్స్‌ అమ్మే వారి పేర్లనే రిపోర్టులో ఉంచారని తెలిపారు. ఇక రాగిని ద్వివేదిని రిమాండ్‌లోకి తీసుకొని 24 రోజులు అవుతుండగా ఇప్పుడు ఆమె తరుపు న్యాయవాది కల్యాణ్‌కుమార్‌ బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. 

ఇక మరోవైపు కర్ణాటకలో డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమనే కాకుండా, బుల్లితెరను కూడా తాకింది. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి, విచారించారు. సీసీబీ పోలీసుల విచారణలో మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌లోనూ సుశాంత్‌ మరణానంతరం డ్రగ్స్‌ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.  దీపికా పదుకొనే లాంటి ప్రముఖ కథనాయకుల పేర్లే కాకుండా ఇంకా మరికొంత మంది పేర్లు ఆ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బయటకు వస్తున్నాయి. 

చదవండి: రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే 

మరిన్ని వార్తలు