Ninne Pelladata: ‘నేను చూసిన నాగార్జుననే సినిమాలో శీనుగా పేరు మార్చి చూపించానంతే’

4 Oct, 2021 09:26 IST|Sakshi

‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం విడుదలై  నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారిలా..

► నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో నాగార్జునగారు ఎలా ఉంటారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు. రియల్‌ లైఫ్‌లో నేను చూసిన నాగార్జుననే సినిమాలో శీనుగా పేరు మార్చి చూపించానంతే.

► చెన్నైలో మూడు నాలుగేళ్లుగా వివిధ డిపార్ట్‌మెంట్స్‌లో రకరకాల పనులు చేస్తున్న నన్ను.. శివ నాగేశ్వరరావు ‘శివ’ సినిమా కోసం రాముగారి వద్ద (రామ్‌ గోపాల్‌ వర్మ) అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేర్పించారు. ‘శివ’ సమయంలో నేను, తేజ, శివ నాగేశ్వరరావు అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా పనిచేశాం. ఆ చిత్ర నిర్మాత నాగార్జునగారు అన్నపూర్ణ స్టూడియోలోనే మాకు గెస్ట్‌ హౌస్‌ ఇచ్చారు. తెలుగు ‘శివ’, హిందీ ‘శివ’ చిత్రాలకు దాదాపు రెండున్నరేళ్లు స్టూడియోలోనే ఉండి పనిచేశాం. అప్పుడు నా జీవితంలో దగ్గరగా చూసిన పెద్ద స్టార్‌ (అక్కినేని నాగేశ్వరరావు) కొడుకు, స్టార్‌ హీరో నాగార్జునగారు. ‘అంతం’ సినిమాకి బెస్ట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నాను. నా పనితీరును గమనించిన నాగార్జునగారు డైరెక్టర్‌ అవుతావా? ఏదైనా కథ రెడీ చేసుకో అన్నారు. 

► ‘అంతం’ సినిమా చిత్రీకరణ ముగిసే సమయంలో విజయవాడ రౌడీయిజంపై నాగార్జునకి ఓ కథ చెప్పాను. ఇంట్రవెల్‌ వరకూ విని.. ‘ఈ కథ వద్దులే వంశీ.. రాము(ఆర్జీవీ) సినిమాలాగానే ఉంది ఇది. నీకు ఇండిపెండెంట్‌ కథ ఉన్నప్పుడు కచ్చితంగా చేద్దాం’ అన్నారు నాగార్జున. నా ‘గులాబీ’ సినిమా అయిపోయిన సమయంలో నాగార్జున ‘రాముడొచ్చాడు’ సినిమా చేస్తున్నారు. అప్పటికే నేను రెడీ చేసుకున్న ‘అన్యాయం’ అనే ఓ కథ వినిపిస్తే, ‘బాగుంది.. కానీ ఇంకొంచెం కొత్తగా చేద్దాం’ అన్నారు.

► ‘గులాబీ’ విడుదలయ్యాక నేను, ‘నిధి’ ప్రసాద్, కెమెరామ్యాన్‌ కలసి వైజాగ్‌లో లొకేషన్స్‌ చూడటానికి వెళ్లాం. ఒకతను వచ్చి.. ‘గులాబి’ సినిమాని అచ్చం మీ బాస్‌లాగా (ఆర్జీవీ) బాగా తీశావ్‌ అన్నాడు. ‘గులాబి’ చిత్రానికి నాకంటూ ప్రత్యేక గుర్తింపు రాలేదా? అని అప్పుడు నేను ఆలోచనలో పడ్డా. వయలెంట్‌ సినిమా తీస్తే బాస్‌లా తీశావంటారు.. ఇప్పటి వరకూ బాస్‌ టచ్‌ చేయని ఫ్యామిలీ జానర్‌లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయాన్ని బాస్‌కి చెబితే ఓకే అన్నారు. నేను ఏ సినిమా చేసినా కథ బాస్‌కి(ఆర్జీవీ) చెప్పేవాణ్ణి.. ఆయనకు నచ్చితే ఓకే అంటారు.. ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే చెప్పేవారు. 

► ఈ చిత్రంలో ‘నా మొగుడు రామ్‌ప్యారి’ అనే పాటని సుద్దాల అశోక్‌ తేజగారు బాగా రాశారు. ఆ ఒక్క పాట మినహా మిగిలిన అన్ని పాటల్ని గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తనదైన శైలిలో అద్భుతంగా రాశారు.

► నాకెప్పుడూ ఒక కొత్త ఇమేజ్‌ క్రియేట్‌ చేయడం ఇష్టం. చలపతిరావుగారి ఫార్ములాయే జీవా, బ్రహ్మాజీలకు వాడాను. ఫ్యామిలీ అంటే రక్త సంబంధీకులే కాదు.. స్నేహితులు కూడా అనే కాన్సెప్ట్‌లో తీసుకున్నాను. చలపతి రావు, చంద్రమోహన్, గిరిబాబు, ఉత్తేజ్‌ పాత్రలు కూడా బాగా పండాయి. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత ‘సింధూరం’ కథ అనుకున్నా. రాఘవేంద్ర రావుగారు నాపై ఉన్న ఇష్టంతో మందలించారు. ‘ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఎవరూ మనల్ని పట్టించుకోరు. మంచి జానర్‌ నుంచి ఎందుకు బయటికొస్తున్నావ్‌.. అందరి హీరోలతోనూ కుటుంబ కథా చిత్రాలు చెయ్‌’ అన్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ హిట్‌ అయ్యాక చాలా మంది హీరోలు కూడా కుటుంబం నేపథ్యంలో మాతో కూడా సినిమాలు చేయమని అడిగారు. అయితే నాగార్జునగారు మినహా వేరే హీరోలపై నాకు కుటుంబ కథా చిత్రం చేయాలనే ఆలోచన రాలేదు.

చదవండి: ఇప్పుడైతే ‘నిన్నే పెళ్లాడతా’లో ఆ సీన్స్‌ చేసేవాణ్ణి కాదు

మరిన్ని వార్తలు