Special Ops 1.5 Review: యాక్షన్‌ థ్రిల్లర్‌ను తలపించే 'స్పెషల్‌ ఆప్స్‌ 1.5' సిరీస్‌ రివ్యూ

14 Nov, 2021 13:23 IST|Sakshi

టైటిల్‌: స్పెషల్‌ ఆప్స్‌ 1.5 (ది హిమ్మత్‌ స్టోరీ)
నటీనటులు:కేకే మీనన్‌, ఆఫ్తాబ్‌ శివదాసాని, గౌతమీ కపూర్‌, ఆదిల్‌ ఖాన్‌, వినయ్‌ పాఠక్‌, ఐశ్వర్య సుస్మిత
నిర‍్మాత: శీతల్‌ భాటియా
దర్శకత్వం: నీరజ్‌ పాండే, శివమ్‌ నాయర్‌
సంగీతం: అద్వైత్‌ నెమలేకర్‌
ఓటీటీ: డిస్నీ ప‍్లస్‌ హాట్‌స్టార్
విడుదల తేది: నవంబర్‌ 12, 2021

ప్రస్తుతం ఇండియాలో ఓటీటీ హవా నడుస్తోంది. సినిమా థియేటర్లకు వెళ్లకుండా మంచి కిక్కించే థ్రిల్లింగ్‌, యాక్షన్‌, లవ్‌ స్టోరీ వంటి చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లను ఈ ఓటీటీల్లో చూడొచ్చు. ఈ సినిమాలు,  వెబ్‌సిరీస్‌లకు మంచి సక్సెస్‌ రేట్‌ కూడా రావడంతో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు ఓటీటీలను వేదికగా చేసుకుని విడుదల చేస్తున్నారు. మళ్లీ థియేటర్‌లో రిలిజైన సినిమాలను ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తూనే.. మరోవైపు సొంతగా నిర్మిస్తున్నాయి. అలాంటి ఓటీటీలో ఫ్లాట్‌ఫామ్‌లో ఒకటైన డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతగా నిర్మించిన వెబ్‌ సిరీస్‌ స్పెషల్‌ ఆప్స్‌. దీన్ని ప్రముఖ దర్శకుడు నీరజ్‌ పాండే తెరకెక్కించారు. ఈ ఫస్ట్‌ సీజన్‌ ఎంతో సక్సెస్‌ సాధించడంతో దీనికి ప్రీక్వెల్‌ వెర్షన్ స్పెషల్‌ ఆప్స్‌ 1.5 పేరుతో విడుదల చేశారు. మరీ ఈ రెండో భాగం మొదటి సీజన్‌ను బీట్‌ చేసిందా ? 

కథ:
రక్షణ సంస్థ 'రా' ఏజెంట్‌ అయిన హిమ్మత్‌ సింగ్‌ (కేకే మీనన్‌) చుట్టూ తిరుగుతుంది ఈ స్పెషల్‌ ఆప్స్‌ 1.5 వెబ్‌ సిరీస్‌. మొదటి సీజన్‌లో ఆపరేషన్స్‌ను లీడ్‌ చేసిన హిమ్మత్‌ సింగ్‌ రహస్యాల గురించి ఆఫిసర్స్‌ రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ పేరుతో కొందరు అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇందుకు హిమ్మత్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన ఎస్సై అబ్బాస్‌ షేక్‌ (వినయ్‌ పాఠక్‌)ను ప్రశ్నలు అగడంతో కథ మొదలవుతుంది. హిమ్మత్‌ సింగ్‌ ఫవర్‌ఫుల్‌ ఆఫిసర్‌ హిమ్మత్‌ సింగ్‌గా ఎలా మారాడు? అతని జీవితంలో ఏం నేర్చుకున్నాడు ? ఏం కోల్పోయాడు ? హనీ ట్రాప్‌తో అధికారులను ఎలా వాడుకున్నారు ? అనేదే స్పెషల్‌ ఆప్స్‌ 1.5.

విశ్లేషణ: 

బేబీ, స్పెషల్‌ 26, ఏ వెడ్నెస్‌ డే, అయ్యారీ వంటి చిత్రాల దర్శకుడు నీరజ్‌ పాండే, శివమ్‌ నాయర్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను పక్కాగా తెరకెక్కించారు. వీరి అనుభవలాతో స్పై థ్రిల్లర్‌ను చాలా బాగా రూపొందిచారు. దర్శకుల శ్రమ చిత్రీకరణలో కనిపిస్తుంది. ఇందులో థ్రిల‍్లింగ్‌ ఎలిమెంట‍్స్‌, యాక్షన్‌ సీన్స్‌ మాత్రమే కాకుండా భావోద్వేగ సన్నివేశాలను కూడా బాగా తీశారు. అధికారుల వ్యక్తిగత జీవితాల్లో ఉండే మానసిక సంఘర్షణను బాగా చూపించారు దర్శకులు. హిమ్మత్‌ సింగ్‌ పాత్ర అత్యంత కఠినంగా మారడానికి గల కారణాలను, ఎదురైన పరిస్థితులను ఎంతో బాగా చూపించారు. అద్వైత్‌ నెమలేకర్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ‍్యూజిగ్‌ ఆకట్టుకుంటుంది.   

ఇది పేరుకు వెబ్‌ సిరీస్‌ అయిన మంచి థ్రిల్లర్‌ మూవీని తలపిస్తుంది. సిరీస్‌లో కేవలం నాలుగు ఎపిసోడ్‌లు మాత‍్రమే ఉండి ఎంతో క్రిస్పీగా తీశారు. అనవసర సన‍్నివేశాలు అంటూ ఏం ఉండవు. అయితే ఇతర పాత్రలతో పోలిస్తే హిమ్మత్‌ సింగ్‌తో యాక్షన్‌ సీన్స్‌ తక్కువగా ఉంటాయి. లీడ్‌ రోల్‌ పాత్రైన హిమ్మత్‌ సింగ్‌తో కొంచెం ఎఫెక్టివ్‌ యాక్షన్‌ సీన్స్‌ చేపిస్తే బాగుండనిపించిన, అతని తెలివితేటలతో మెప్పిస‍్తాడు. అక్కడక్కడ వచ్చే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. చాలా వెబ్ సిరీస్‌ల్లాగా ఈ సిరీస్ అర్థం కావాలంటే ముందు వచ్చిన భాగాన్ని చూడక్కర్లేదు. ఇందులో పూర్తిగా ప్రత్యేక ఆపరేషన్ చూపిస్తారు కాబట్టి అది చూడకపోయినా.. దీన్ని చూడవచ్చు.  అయితే ఈ సిరీస్ చూశాక మాత్రం మొదటి స్పెషల్ ఆప్స్ సిరీస్ కచ్చితంగా చూడాలనిపిస్తుంది. 

 ఎవరెలా చేశారంటే..?

ఇందులో ప్రధాన పాత్ర పోషించిన కేకే మీనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.  దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజీ సినిమాలో కెప్టెన్ రన్ విజయ్ సింగ్ పాత్రను పోషించింది ఈయనే. హిమ్మత్ సింగ్ పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయారు. పాత్రకు ఎంత కావాలో అంత మేరకే నటిస్తూ సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఆయన నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ‍్యంగా ఒక సీన్‌లో తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపటేస్తాడు. ఇక హిమ్మత్ స్నేహితుడు విజయ్ పాత్ర పోషించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆఫ్తాబ్ శివదాసానీ, మణిందర్ సింగ్ పాత్రను పోషించిన ఆదిల్ ఖాన్, అబ్బాస్ షేక్ పాత్రను పోషించిన వినయ్ పాఠక్ తమ పాత్రలను చక్కగా పోషించారు. 

ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఇది పేరుకు వెబ్ సిరీస్ అయినా సినిమా తరహాలో మూడు గంటల నిడివే ఉంది. మంచి సిరీస్ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు. ఈ సిరీస్‌ను తెలుగులో కూడా డబ్ చేశారు కాబట్టి చూడాలనుకున్నప్పుడు భాషా సమస్య కూడా తలెత్తదు. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు కాబట్టి కుటుంబంతో సహా ఎంజాయ్ చేయవచ్చు. ఆఖరి ఎపిసోడ్‌లో తర్వాతి సీజన్‌కు సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. త్వరలో మరో సీజన్‌ కూడా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. 

మరిన్ని వార్తలు