మాస్టార్‌లు వాళ్లే!

5 Sep, 2020 02:45 IST|Sakshi

తప్పొప్పులు తెలియాలంటే ముందు తప్పేదో ఒప్పేదో తెలియాలి. వెళ్లే దారి సరైందో లేదో తెలియాలంటే గమ్యం మీద అవగాహన ఉండాలి. ఒక సబ్టెక్ట్‌ను ఇష్టంగా చదువుతున్నామంటే అందులో ఆసక్తి కలిగించే విషయాలుండాలి. లేదా ఆసక్తికరంగా బోధించే గురువు ఉండాలి. మనం సక్రమంగా ఉన్నామంటే దాని వెనక కచ్చితంగా ఓ గురువు ఉంటాడు. సమాజానికి ఉపయోగపడుతున్నాం అంటే దాని వెనక ఓ గొప్ప ఉపాధ్యాయుడుంటాడు. నేడు ఉపాధ్యాయుల దినోత్సవం. మనందర్నీ తీర్చిదిద్దిన గురువులందర్నీ గుర్తు చేసుకుందాం. మేం స్టార్స్‌ కావచ్చు. కానీ మా–స్టార్‌లు వాళ్లే అని తమ అభిమాన టీచర్స్‌ గురించి కొందరు స్టార్స్‌ చెప్పారు. ఆ విశేషాలు. 
 
నా గురువు సుహాస్‌ లిమయే ఇటీవలే మరణించారు. సార్‌.. మీరు నా అభిమాన గురువు. మీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. నాకు అన్నీ తెలుసు అనుకోకుండా ఎప్పుడూ విద్యార్థిలాంటి ఉత్సాహం, నేర్చుకున్న ప్రతీది నేర్పించాలి అనే మీ ఆలోచనా నాకు ఎంతో నచ్చేవి. అందుకే అంత గొప్ప మాస్టారు మీరు. మీతో గడిపిన నాలుగేళ్లు నా మదిలో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయి. మీరు నాకు మరాఠీ మాత్రమే కాదు. దానికి మించి ఎన్నో విషయాలను బోధించారు.
– ఆమిర్‌ ఖాన్‌

నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ముఖ్య కారణం మా టీచర్సే. స్కూల్లో నా ఫేవరెట్‌ సబ్జెక్ట్‌ ఇంగ్లిష్‌. దానికి కారణం మా ఇంగ్లిష్‌ టీచరే. నన్ను చాలా సపోర్ట్‌ చేశారామె. ఆమె ప్రోత్సాహంతోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడం అలవాటయింది. అలాగే పబ్లిక్‌లోనూ చురుకుగా మాట్లాడగలిగే టెక్నిక్స్‌ చాలా నేర్పారామె. మా స్కూల్‌లో (భారతీ పబ్లిక్‌ స్కూల్‌) టీచర్‌ నుంచి స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా ఆమెకు ప్రమోషన్‌ వచ్చిందని తెలిసి చాలా సంతోషించాను. ఆమె ప్రిన్సిపాల్‌గా ఇన్‌చార్జ్‌ తీసుకునే రోజు ఆమెను స్కూల్‌కి వెళ్లి కలవడం నాకో మంచి జ్ఞాపకం.
– తాప్సీ

సాధారణ టీచర్లు కేవలం పాఠం వరకూ చెప్పి వెళ్లిపోతారు. కానీ గొప్ప టీచర్లు మనకు అర్థమయిందా లేదా? అని చూస్తారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నేర్పిస్తారు. మన జీవితంలో టీచర్స్‌ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కానీ వాళ్ల పాత్రకు చాలా తక్కువ అభినందన వస్తుంటుంది. వాళ్ల ప్రభావం మన మీద ఎంత ఉంటుందో ఆ ఉపాధ్యాయులు కూడా ఉహించలేరు. నిస్వార్థంగా మనల్ని తీర్చిదిద్దుతారు. ఆ ఘనత గురించి చెప్పుకోరు. అది వాళ్ల గొప్పతనం.
– లావణ్యా త్రిపాఠి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా