జనం మనిషి

5 Aug, 2020 03:00 IST|Sakshi

ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. యువతను చైతన్యపరచిన పాట. ఓడా నువ్వెళ్లిపోకే.. శ్రామికుడి బాధను వ్యక్తపరిచిన పాట. యంత్రమెట్టా నడుస్తు ఉందంటే.. యంత్రం కంటే మనిషి గొప్ప అని చెప్పే పాట. అన్నంపెట్టే అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యమా.. రైతు బాధను చెప్పిన పాట... వంగపండు పాట జనంలోంచి వచ్చింది. అందుకే అన్నీ జనం మెచ్చిన పాటలయ్యాయి.

మూడు దశాబ్దాల కాలంలో సుమారు 300 వందల పైచిలుకు జానపద పాటలు రాశారు వంగపండు ప్రసాదరావు. అలాగే ఓ 30 సినిమాలకు పాటల్ని కూడా  రచించారాయన. ఆర్‌. నారాయణ మూర్తి తీసిన ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ చిత్రంతో వంగపండు సినీ ప్రస్థానం మొదలయింది. ఈ సినిమా కోసం రాసిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా, ఏం పిల్లో ఎల్దమొస్తవా...’ పాటకు విశేష ఆదరణ లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో మారుమోగిపోయింది. ఇదే సినిమాకి ‘నీయమ్మ చచ్చినా’ అనే పాట కూడా రాశారు. ఆర్‌.నారాయణ మూర్తి తెరకెక్కించిన ‘ఆలోచించండి, భూపోరాటం, అడివి దివిటీలు, చీమలదండు, అన్నదాత సుఖీభవ’ వంటి చిత్రాల్లో పాటలు రాశారు వంగపండు. ‘చీమలదండు’లో మనిషికన్నా యంత్రం ముఖ్యం అనే భావం వచ్చే సన్నివేశాల్లో ‘యంత్రమెట్ల నడుస్తున్నదంటే..’ అనే పాటను రాశారు వంగపండు.

యంత్రాన్ని కనిపెట్టేది మనిషే.. ఆ యంత్రాన్ని నడపేది కూడా మనిషే.. మనిషి కంటే యంత్రం ఎలా గొప్పదవుతుంది అంటూ ఆయన రాసిన పాట చాలామంది హృదయాలను తాకింది. ఇక ‘అన్నదాత సుఖీభవ’ సినిమా కోసం రాసిన ‘అన్నం పెట్టే అన్నదాతలకు ఆత్మహత్యే శరణ్యమా..’ పాట పేద రైతుల కష్టాలను కళ్లకు కట్టింది. ‘ఎర్ర సముద్రం’ సినిమాలో ఎంతో కష్టపడి తయారు చేసిన ఓడను షావుకారు తీసుకెళుతున్నప్పుడు ‘ఓడా.. నువ్వెళ్లిపోకే..’ అంటూ వంగపండు కలం కన్నీరు పెడితే, ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. అలానే మాదాల రంగారావు, టి.కృష్ణ, దాసరి సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో పాటలు రాశారు వంగపండు. నాలుగైదు సినిమాల్లో నటించారు కూడా. వంగపండు జనం మనిషి. అందుకే ‘ఏం పిల్లడో పోయి వస్తవా..’ అంటూ వంగపండు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. ఆయన మృతి పట్ల ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. 

మరిన్ని వార్తలు