ఇది ధైర్యం కాదు... భయం లేకపోవడం!

29 Jun, 2021 07:31 IST|Sakshi
కవిత యాగ బుగ్గన, నేపాల్, హమ్లా వ్యాలీలోని మహిళతో కవిత

గ్రేట్‌ జర్నీ

ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎకనమిక్స్‌లో ఎంఫిల్‌ చేసిన కవిత యాగ బుగ్గన యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ నిపుణులుగా, ఇండియాలో డెవలప్‌మెంటల్‌ ఎకనమిస్ట్‌గా చేశారు. ట్రావెల్, ఫిక్షన్, నాన్‌ఫిక్షన్‌ రైటర్‌. రిషివ్యాలీ స్కూల్‌ ఆమెకు ప్రపంచాన్ని చదవడం నేర్పించింది. సునిశితంగా విశ్లేషించి, ప్రశ్నించగలిగిన నైపుణ్యాన్ని అలవరిచింది. ‘‘వీటన్నింటి నేపథ్యంలో నాకు తెలిసిందేమిటంటే... ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని నిస్సారంగా గడపడం కాదు, సమాజం నుంచి దూరంగా వెళ్లిపోవడమూ కాదు. సమాజంలో జీవిస్తూ, వృత్తి ఉద్యోగాలలో కరుణపూరితంగా వ్యవహరించగలగడం’ అంటారామె.

ఆ నీటిలో విషం లేదు!
కవిత విస్తృతంగా పర్యటనలు చేస్తారు. అవి సాహసానికి లోతైన నిర్వచనాన్ని తెలియచేస్తుంటాయి. అవన్నీ జీవితాలను అర్థం చేసుకోవడానికే అయి ఉంటాయి. మూఢనమ్మకాలను తుడిచేయడానికి సాహసాలు చేశారు. మన్‌సరోవర్‌ సమీపంలోని రాక్షస్‌తాల్‌ ను స్థానికులు విషపు నీటి మడుగు అంటారు. రావణాసురుడు ఆ మడుగు దగ్గర తపస్సు చేసిన కారణంగా అవి విషపూరితమయ్యాయనే కథనంతో ఆ సరస్సు సామాజిక బహిష్కరణుకు గురైంది. కవిత తన పర్యటన సందర్భంగా ఆ నీటిని తాగి ‘నేను తాగాను, ఏమైంది’ అని ప్రశ్నించారు. కొంచెం ఉప్పగా ఉన్న కారణంగా ఆ నీటిని తాగవద్దు అని చెప్పడానికి ఇంత పెద్ద ట్యాగ్‌ తగిలించడం ఏమిటనేది ఆమె ప్రశ్న.

అందరూ తీర్పరులే!
ప్రయాణం అంటే ప్రదేశాలను చూసే వ్యాపకం కాదు, జీవితాలను చదివే సాధనం అంటారు కవిత. గుంటూరు జిల్లాలోని స్టూవర్ట్‌పురం మీదుగా ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయాణించి ఉంటారు. స్టేషన్‌ పేరు విని ఆ పేరు రావడానికి కారణాలు తెలుసుకుని, ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అన్వేషించారు కవిత. కులవ్యవస్థ మన సమాజంలో అభివృద్ధి నిరోధకంగా ఉన్న పెద్ద అడ్డంకి. అయితే ఏకంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని దొంగలుగా ముద్ర వేయడాన్ని తీవ్రంగా నిరసించారామె. ‘‘ఒక వ్యక్తి గుణగణాలు ఆ వ్యక్తికే పరిమితం. ఒక వ్యక్తి దుర్గుణాలను ఆ కుటుంబం మొత్తానికి ఆపాదించడమే పెద్ద తప్పు, అలాంటిది ఆ కులమంతటికీ ఆపాదించడం ఏమిటి? సంస్కరణ పేరుతో వారిని బలవంతం గా ఒకచోటకు తరలించి, ఇక్కడే నివసించాలనే నిర్దేశించడం శిక్షార్హమైన నేరం’’ అంటారు కవిత.

మన సమాజంలో అగ్రవర్ణాలుగా చలామణిలో ఉన్న వాళ్ల విషయంలో ఇలాగే చేసేవారా... అంటూ అప్పటి బ్రిటిష్‌ పాలకుల విధానాన్ని నిరసించారు. తన ప్రయాణ పరిశోధనలన్నింటినీ అక్షరబద్ధం చేస్తారామె. మన సమాజంలో ఉన్న పెద్ద అవలక్షణం... ఇతరుల జీవితానికి ప్రతి ఒక్కరూ తీర్పరులుగా మారిపోవడమే అంటారు కవిత. పాశ్చాత్య జీవనశైలిని మన జీవితాల్లోకి స్వాగతించినంత బేషరతుగా వారి ఆలోచన ధోరణిని అలవరుచుకోవడం లేదంటారామె. హిందూ, రివర్‌ టీత్, తెహల్కా, జాగరీ లిట్‌ వంటి వార్తాపత్రికలు, ఫిక్షన్‌– నాన్‌ ఫిక్షన్‌ జర్నల్స్‌లో ప్రచురితమైన రచనల్లో ఆమె తెలుగు నేల మీద విస్తరించిన బ్రిటిష్‌ కాలనీ బిట్రగుంటను కూడా ప్రస్తావించారు. చైనా పాలనలో టిబెట్‌ వాసుల అసంతృప్తినీ, నేపాల్‌లోని హమ్లా వ్యాలీ ప్రజల పేదరికాన్నీ రాశారు.

అసలైన తాత్వికత
శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, యూఎస్, కెనడా,స్పెయిన్, చైనా, జపాన్, కాంబోడియా, మయన్మార్, థాయ్‌ల్యాండ్, టాంజానియావంటి అనేక దేశాల్లో పర్యటించిన కవిత అసలైన తాత్విక జీవనం సాగిస్తున్నది సంచార జాతులేనంటారు. ‘‘ఆదివాసీలు, అందులోనూ సంచార జాతుల ఫిలాసఫీ చాలా గొప్పది. ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండవు, అందుకే ఈర్ష్య, అసూయ, వైషమ్యాలు ఉండవు. జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. అడవుల్లో జీవించే వాళ్లు ప్రకృతి ఏమి ఇస్తే దాంతోనే జీవితం అనుకుంటారు, ప్రకృతికి హాని కలిగించరు. ప్రభుత్వాలు అడవి మీద ఆధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడంతో వారి జీవితాల్లో ఒడిదొడుకులు మొదలయ్యాయ’’ంటారు కవిత. మగవాళ్లు సాహసించని ప్రదేశాలకు కూడా ఆమె చొరవగా వెళ్లిపోతారు, అక్కడి విషయాలను అంతే ధైర్యంగా రాస్తారు. అదే విషయాన్ని ఆమె ‘ఇది ధైర్యం కాదు, భయం లేకపోవడం’ అంటారు. జీవితం పట్ల ఆందోళన, భయం లేనప్పుడు ఏదీ భయపెట్టద’ని రిషీవ్యాలీ స్కూల్‌ నేర్పించిన ఫిలాసఫీని మరోసారి గుర్తు చేశారు.
– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు