బాలీవుడ్‌ హాట్‌ఫేవరెట్ కియారా

27 Feb, 2021 05:28 IST|Sakshi

కియారా అద్వానీ... ప్రస్తుతం బాలీవుడ్‌ హాట్‌ఫేవరెట్‌. ఆమె చేసిన ‘కబీర్‌ సింగ్‌’ 300 కోట్లు వసూలు చేసింది. ఆమె భాగమైన ‘గుడ్‌ న్యూస్‌’ సుమారు 250 కోట్లు కలెక్ట్‌ చేసింది. క్రేజీ ప్రాజెక్ట్స్‌ అన్నీ ఆమెనే హీరోయిన్‌గా కావాలంటున్నాయి. ప్రస్తుతం ఐదు సినిమాలు కియారా చేతిలో ఉన్నాయి. బాలీవుడ్‌ నెక్ట్స్‌ సూపర్‌స్టార్‌ హీరోయిన్‌ కియారాయేనా? ప్రస్తుతం ఆమె చేస్తున్న చిత్రాల విశేషాలు చూద్దాం.

భూల్‌ భులెయ్యా 2
2007లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా వచ్చిన హారర్‌ కామెడీ చిత్రం ‘భూల్‌ భులెయ్యా’. 14 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌. టబు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మనాలీలో జరుగుతుంది. నవంబర్‌ 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

షేర్‌షా
ఆర్మీ కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షేర్‌షా’. టైటిల్‌ రోల్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించారు. తమిళ దర్శకుడు విష్ణువర్థన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విక్రమ్‌ బాత్రా భార్యగా కనిపించనున్నారు కియారా. ఈ సినిమా విడుదల కోవిడ్‌ వల్ల వాయిదా పడింది. తాజాగా జూలై 2న సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.

కర్రమ్‌ కుర్రమ్‌
ప్రముఖ దర్శకుడు అశుతోష్‌ గోవారీకర్‌ నిర్మాణంలో తెరకెక్కనున్న చిత్రం ‘కర్రమ్‌ కుర్రమ్‌’. లేడీ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కియారా లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. అశుతోష్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన గ్లెన్‌ బరెట్టో, అంకుష్‌ మోహ్లా ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు. స్వయం ఉపాధిలా సొంతంగా అప్పడాలు తయారు చేసుకునే కొందరి స్త్రీల కథ ఇదని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ వేసవిలో ఆరంభం కానుంది.

మిస్టర్‌ లేలే
‘ధడక్‌’ దర్శకుడు శశాంక్‌ కైతాన్‌ ఓ పూర్తి స్థాయి కామెడీ చిత్రం తెరకెక్కించనున్నారు. ‘మిస్టర్‌ లేలే’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో విక్కీ కౌశల్, కియారా అద్వానీ జంటగా నటిస్తారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

జగ్‌ జగ్‌ జీయో
వరుణ్‌ ధావన్, కియారా అద్వానీ జంటగా రాజ్‌ మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జగ్‌  జగ్‌ జీయో’. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో వరుణ్‌ ధావన్, కియారా భార్యాభర్తలుగా నటిస్తున్నారు. అనిల్‌ కపూర్, నీతూ కపూర్‌ ముఖ్య పాత్రల్లో న టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు.

అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది నాలుగు సినిమాలతో థియేటర్స్‌లో పలకరిస్తారు కియారా. ఇప్పుడు చేతిలో ఉన్న ఈ సినిమాలు కాకుండా ఇంకో సినిమా కూడా చర్చల దశలో ఉందని బాలీవుడ్‌ టాక్‌. ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’తో సూపర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు సందీప్‌ వంగ తెరకెక్కిస్తున్న ‘యానిమల్‌’లో అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్‌ ఉంది. తెలుగులో ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ సినిమాలో హీరోయిన్‌గా కియారా పేరు పరిశీలిస్తున్నారన్నది ఓ వార్త. ఇదే దూకుడును కొనసాగిస్తే త్వరలో టాప్‌ హీరోయిన్‌ చైర్‌లో కియారా కూర్చునే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు