లేట్‌ అయినా లేటెస్ట్‌గా వస్తామంటున్న స్టార్‌ హీరోలు

3 Dec, 2022 09:08 IST|Sakshi

అభిమాన హీరో సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ చెప్పిన తేదీకి ఆ సినిమా రాకపోతే నిరుత్సాహపడతారు. 2022లో అలా అభిమానులను నిరాశపరచిన స్టార్స్‌ ఉన్నారు. ఈ ఏడాది సిల్కర్‌ స్క్రీన్‌పై కనిపించాల్సిన ఆ హీరోల సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. లేట్‌ అయినా కొన్ని మెరుగులు దిద్దుకుని లేటెస్ట్‌గా రావడానికి ఆ స్టార్స్‌ రెడీ అవుతున్నారు. ఇక వాయిదా పడిన కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.

వరుస పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్‌ హీరోగా నటించిన మరో పాన్‌ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్‌ నటించారు. ‘ఆదిపురుష్‌’ నుంచి రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాని 2022 ఆగస్టు 11న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తొలుత ప్రకటించడంతో సినీ అభిమానులు, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే కొన్ని కారణాల వల్ల ‘ఆదిపురుష్‌’ ఆగస్టులో వాయిదా పడి 2023 సంక్రాంతి బరిలో నిలిచింది. జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రాఫిక్స్, పాత్రల తీరు బాగా లేవంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో చిత్రయూనిట్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టిందని టాక్‌. ఈ క్రమంలోనే జనవరి 12న రిలీజ్‌ వాయిదా వేసి, జూన్‌ 16న విడుదల చేయడానికి నిర్ణయించుకుని ఉంటారని ఊహించవచ్చు.

కాగా విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్భంగా ఈ డిసెంబర్‌ 23న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. అయితే, అనారోగ్య సమస్యల వల్ల సమంత షూటింగ్‌కి దూరం కావడంతో చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉందట. ఈ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2023 ఫిబ్రవరి లేదా వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉందట యూనిట్‌.

ఇక సమంత టైటిల్‌ రోల్‌లో నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఈ పీరియాడికల్‌ మూవీని నవంబర్‌ 4న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. అయితే ఆ డేట్‌కి వాయిదా పడింది. ఈ సినిమాను 3డీ ఫార్మాట్‌లో బెస్ట్‌ క్వాలిటీతో విడుదల చేయాలని చిత్రయూనిట్‌ నిర్ణయించుకుంది. ఈ పనుల కోసం మరింత సమయం పట్టనుండటంతో  రిలీజ్‌ను వాయిదా వేసినట్లు యూనిట్‌ ప్రకటించింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడనే విషయంపై చిత్రబృందం త్వరలో క్లారిటీ ఇవ్వనుంది.

అదేవిధంగా అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఏజెంట్‌’ కూడా వాయిదాల లిస్ట్‌లో ఉంది. ఈ సినిమా కోసం అఖిల్‌ చాలా హార్డ్‌ వర్క్‌ చేసి, సిక్స్‌ ప్యాక్‌ బాడీని కూడా బిల్డ్‌ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 12న ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు వాయిదా పడింది. ఆ తర్వాత ఈ డిసెంబర్‌లో రిలీజ్‌ ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ‘ఏజెంట్‌’ని 2023 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. అయితే సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్‌ ‘వారసుడు’ చిత్రాలు విడుదలవుతున్నాయి. సీనియర్‌ హీరోల సినిమాల మధ్య యువ హీరో నటించిన ‘ఏజెంట్‌’ రిలీజ్‌ అవుతుందా? కాదా అనే టాక్‌ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఈ సినిమా రిలీజ్‌పై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అలాగే పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకి అక్టోబరులో విడుదల చేయాలనుకున్నారు. అయితే పవన్‌ కల్యాణ్‌ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తుండటంతో షూటింగ్‌ ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్‌.

కాగా తమిళ హీరో ధనుష్‌ నటించిన తొలి స్ట్రయిట్‌ తెలుగు చిత్రం ‘సార్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ డిసెంబర్‌ 2న (శుక్రవారం) విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేస్తూ యూనిట్‌ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్‌. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకుడు. ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తొలుత ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 17కి వాయిదా పడింది.  ఇవే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా వివిధ కారణాల వల్ల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఏడాదిలో రిలీజ్‌కి సరికొత్తగా ముస్తాబవుతున్నాయి.

మరిన్ని వార్తలు